
ఆధార్ తరహాలోనే భూధార్
పెర్కిట్/ నందిపేట / మాక్లూర్: ఆధార్ తరహాలోనే భూధార్ పేరిట ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్ కేటాయించనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా భూ భారతి చట్టం రైతులకు దోహదపడుతుందన్నారు. ఆర్మూర్, నందిపేట, మాక్లూర్ మండల కేంద్రాల్లో శనివారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. భూధార్‌తో భూ ఆక్రమణలు, వివాదాలకు ఆ స్కారం ఉండదన్నారు. రైతులకు వారి భూములపై పూర్తి హ క్కులు, భరోసా లభిస్తుందన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మే, జూన్ నెలల్లో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 60 రోజుల వ్యవధిలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కొత్త ఆర్‌వోఆర్ చట్టం ప్రకారం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తారని వివరించారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలలో సమగ్ర వివరాలతో హద్దులను పేర్కొంటూ భూ పటాన్ని పొందుపరుస్తారని తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు భూభారతి చట్టం ద్వారా మోక్షం కలిగిందన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఆర్డీవోలు రాజాగౌడ్, స్రవంతి, తహసీల్దార్లు సత్యనారాయణ, శేఖర్, వసంత రావు, ఎంపీడీవోలు లక్ష్మారెడ్డి, శ్రీనివాసరావు, ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్, పీఏసీఎస్ చైర్మన్లు బూరోల్ల అశోక్, మీసాల సుదర్శన్, భరత్‌రెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ డైరెక్టర్లు ఎస్ వెంకటేశ్వర్‌రావు, పెంట ఇంద్రుడు, వ్యవసాయ శాఖ అధికారి జ్యోత్స్న, భవానీ, రైతులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు