కామారెడ్డి క్రైం: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ద్యాప మహేశ్(29) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి రెండేళ్ల క్రితం తిరిగి వచ్చాడు. గల్ఫ్‌లో ఉన్నప్పుడే అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకొని తండ్రిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని భావించాడు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎంతకీ సంబంధం కుదరకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపానికి గురువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిసింది. ఆదివారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లిన మహేశ్ ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి సాయిలు, ఇతర కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించారు. సమీపంలోని రైలు పట్టాలపై మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఉరేసుకొని ఒకరు..
నవీపేట: మండలంలోని మోకన్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజు (45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కొన్నిరోజులుగా రాజు మద్యానికి బానిసైనట్లు పేర్కొన్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 29 మందిని కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్ష, జరిమానా, మరో 25 మందికి జరిమానాలు విధించింది. వారందరికీ సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు. క్రమం తప్పకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
రామారెడ్డి: రామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. కూతురిపై వేధింపులతో తండ్రిపై, ఇదే వ్యవహారంలో మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లుగా విశ్వసనీయ సమాచారం.
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ పట్టణ శివారులోని మర్రి మైసమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాన్ని పగులగొట్టి ఆలయంలోని పూజోపకరణ సామగ్రి, 10 కిలోల ఇత్తడి దీపం, శఠగోపం, యాంప్లిఫైర్‌తోపాటు హుండీలోని నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు.
మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేటలో సోమవారం వర్షం కురుస్తుండటంతో పలువురు రైతులు చెట్టు కింద కూర్చున్నారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోందని గ్రహించి కొద్దిదూరం వెళ్లగానే చెట్టుపై పిడుగుపడింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య