'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా', 'వంశీ ఇంటర్నేషనల్' అండ్ ' సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "నవరసాల నటసామ్రాట్" (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో ఆదివారం 2 గంటల పాటు అద్భుతంగా నిర్వహింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా.. అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్, భారత్ దేశాల నుంచి 50మంది ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు పాల్గొని, ఆణిముత్యాలైన 50 సినిమాలలో అక్కినేనిగారి నటనా వైదుష్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు అందించారు. నిర్వాహక సంస్థల అధ్యక్షులైన డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్, ప్రముఖ సినీ కవి భువనచంద్ర తమ సందేశాలు అందించగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించారు.
ప్రముఖ అవధాని డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రచయిత్రులు కె.వి కృష్ణకుమారి, గంటి భానుమతి, డా తెన్నేటి సుధాదేవి, తిరునగరి దేవకీదేవి, గాయని సురేఖ మూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డా టి గౌరీశంకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా సూర్య ధనంజయ్ మొదలైనవారు ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, "మనం" సినిమా మాటల రచయిత అయిన సినీ నటుడు హర్షవర్ధన్ మనం సినిమాపై విశ్లేషణ వ్యాసం అందించారని నిర్వాహకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ అక్కినేని గారి అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను, తనకు వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి పంచుకున్నారు.
సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భగ్న ప్రేమిక, హాస్య భరిత, భక్త పాత్రలలో దేనిలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి చిత్రం ఆసాంతం ఆకట్టుకునేలా నటించగలిగే అద్వితీయ ప్రతిభ అక్కినేనిగారిది. దానిని నిరూపించే విధంగా ఉన్న 50 సినిమాలలో వారి నట విశ్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏడు దేశాల నుంచి 50 మంది వక్తలు మాట్లాడటం ఇదే తొలిసారి అని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు.
అనితర సాధ్యమైన నటనతో, అతి స్పష్టమైన ఉచ్చారణతో, కళ్ళతోనే అనేక భావాలు పలికించగలిగే అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి వారి శతజయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి అండ్ కల్చరల్ టీవి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. సుమారు వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాల నుంచి వీక్షించారు.
(చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment