న్యూయార్క్: అమెరికాలో 22 నెలలకు పైగా న్యాయ పోరాటం తర్వాత ఓ భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఊరట కలిగింది. తాను కొనుక్కున్న ఇంటిలో తిష్టవేసిన జంట ఎట్టకేలకు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ భారతీయ అమెరికన్ ఊపిరి పీల్చుకున్నాడు.
గతేడాది ఫిబ్రవరిలో బ్యాంక్ వేలంలో జెరిఖోలోని ఫ్రెండ్లీ లేన్‌లోని 1,536 చదరపు అడుగుల ఇంటిని బాబీ చావ్లా అనే ఇండియన్ అమెరికన్ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటి గత యజమానులైన బారీ, బార్బరా పొలాక్ ఆ ఇంటిని విడిచి పెట్టకుండా తిష్ట వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
తాను ఆ ఇంటి కోసం పన్నులు, తనఖా చెల్లింపులు, ఇతర బిల్లుల రూపంలో ఇప్పటివరకు 85 వేల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు చావ్లా పేర్కొన్నాడు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన చావ్లా తల్లిదండ్రులను బారీ పొలాక్ తిడుతూ "పాకిస్తాన్‌కు వెళ్లిపోండి" అంటూ అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది.
నిందితులు 1990లో 2,55,000 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2006 నాటికి తమ తనఖా చెల్లించడం మానేశారు. కోర్టు పత్రాల ప్రకారం, 2008లో ఇల్లు జప్తునకు రాగా బారీ, బార్బరా పొలాక్ జంట ఒక దశాబ్దానికి ఇల్లు జప్తు కాకుండా దశాబ్దానికిపైగా కేసును లాక్కొచ్చారు. ఇంటి జప్తు నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఏడు సార్లు దివాలా పిటిషన్లు వేశారు.
బార్బరా పొలాక్ గత నెలలో తాజాగా మరోసారి దివాలా పిటిషన్ వేయడంతో ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం ఆగిపోయింది. కాగా గతవారం కేసును విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి పోలాక్స్‌ను మళ్లీ దివాళా పిటిషన్లు దాఖలు చేయకుండా నిరోధించారు. దీంతో ఆ జంట చివరకు డిసెంబర్ 22న ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు.
"ఇది క్రిస్మస్ అద్భుతంలా అనిపిస్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అని ది న్యూయార్క్ పోస్ట్‌తో బాబీ చావ్లా అన్నారు. తాను ఆ ఇంటిని తన ఆరు నెలల గర్భిణీ సోదరి, ఆమె భర్తకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment