ట్యూష‌న్‌ డబ్బుతో పేదలకు సాయం | NATS Newest Social Service By 4 Girls In Bay Area California | Sakshi
Sakshi News home page

నాట్స్ చేయూతతో బాలికల సామాజిక సేవ

Published Sun, Aug 2 2020 3:43 PM | Last Updated on Sun, Aug 2 2020 4:00 PM

NATS Newest Social Service By 4 Girls In Bay Area California - Sakshi

కాలిఫోర్నియా: కరోనా కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్ వ‌ల్ల‌ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాలో నలుగురు తెలుగు విద్యార్థినులు కూడా పేదలకు సాయం చేసేందుకు సరికొత్తగా ఆలోచించారు. తమకు బాగా వచ్చిన ఇంగ్లీష్, మ్యాథ్స్, క్రియేటివ్ రైటింగ్, స్పీచ్, డిబేట్స్ లాంటి అంశాలపై చిన్నారులకు పాఠాలు చెప్పి 400 డాలర్లు సంపాదించారు. ఇందుకోసం వారు దాదాపు 60 గంటల సమయాన్ని వెచ్చించి చిన్నారులకు ట్యూషన్లు చెప్పారు. వీరికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. ఇలా ఆ తెలుగు విద్యార్థినులు సంపాదించిన సొమ్మును నాట్స్ ద్వారా కాలిఫోర్నియా కాంకర్డ్ లోని ఫుడ్ బ్యాంక్‌కు విరాళంగా అందించారు.

ఈ ఫుడ్ బ్యాంక్ పేదల ఆకలి తీర్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఈ నలుగురు తెలుగు విద్యార్ధులను ప్రోత్సాహించి వారు ఈ సరికొత్త సామాజిక సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చారు. శాన్ రమోన్‌కు చెందిన నందిని మంచికలపూడి, మోనితా గోపి, సాత్విక బొమ్మదేవర, శ్రేయ కొల్లిపర ఈ తెలుగు విద్యార్థినులు మానవత్వంతో స్పందించిన తీరు పట్ల అటు ఫుడ్ బ్యాంక్ అధికారులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నలుగురి  సేవాభావం మరింతమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నాట్స్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ మంచికలపూడి తన పదవికాలం చివరి రోజు వరకు కూడా ఆయన ఏదో ఒక కార్యక్రమంతో నాట్స్ ఉన్నతిని పెంచడంలో కృషి చేశారు. తాజాగా ఈ నలుగురు తెలుగు విద్యార్థినులను ప్రోత్సాహించి వారిని కూడ సేవాభావం వైపు నడిపించడంలో తనదైన పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ డైరక్టర్ కృష్ణ మల్లిన ఈ తెలుగు విద్యార్థినులకు కావాల్సిన సహాయ సహాకారాలు అందించారు. నాట్స్ నుంచి ఆ నలుగురు తెలుగు విద్యార్థినులకు ప్రశంస పత్రాలు అందించారు.

త్వరలో బే ఏరియా శాన్ రమోన్‌లో నాట్స్  విభాగం
బే ఏరియాలోని శాన్ రమోన్‌లో నాట్స్ విభాగం ఏర్పాటుకు స్థానికులు ముందుకొచ్చారు. నాట్స్ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన నలుగురు తెలుగు విద్యార్థినులతో పాటు, స్థానికంగా ఉండే తెలుగు కుటుంబాలు నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉత్సాహం చూపించాయి. తాము నాట్స్‌లో చేరి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామన్నార‌ని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. బే ఏరియా శాన్ రమోన్‌లో నాట్స్ త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. ఈ ప్రాంతంలో నాట్స్ విభాగం ఏర్పాటుకు రాగ బోడపాటి పూర్తి సహాయ సహాకారాలు అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో శాన్ రమోన్ నాట్స్ సేవా కార్యక్రమాలు మరింత ముమ్మరం కానున్నాయనే ఆశాభావాన్ని శ్రీనివాస్ మంచికలపూడి వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement