అధునాతన సాంకేతికతకు ఆలవాలమైన సిలికాన్ లోయ, (USA)మహాదేవుని పదవిన్యాసపు ఆనంద అనుభూతిలో ఓ సాయంకాలం సేదదీరిన వైనం.. సనాతన ధర్మాన్ని సనూతనంగా నిలుపుకుంటూన్న భారతీయ బంధువులు ధర్మ సంపదను వారసత్వంగా ముందుతరాలకు అందిస్తున్న విన్యాసం.. సామవేద సారమంతా వెల్లువయ్యి, శివపద మంజీరాల నాదధారలుగా పొంగి చైతన్యపు స్రవంతులు పశ్చిమ పర్వతసానువులను పులకింపచేసిన అద్భుతం..
బుడిబుడి నడకల బుజ్జాయిలు సైతం పరమశివ తత్వాన్ని కలిగించేలా గత ఆదివారం అమెరికాలో శాన్ హొసె (కాలిఫోర్నియా)లో నిర్వహించిన సామవేదం షణ్ముఖశర్మ విరచిత శివపదం సంకీర్తనలు “శివ మూర్తుల వైభవం” విశేషంగా నిలిచాయి.
వాణి గుండ్లాపల్లి నిర్వహణలో 12 మంది గురువులు కూచిపూడి, భరతనాట్య, మోహినీ ఆట్టం, కథక్, ఒడిసి రీతులన్నీ అలవోకగా మేళవిస్తూ సమ్మోహనపరచాయి. గురువులు: గురు బిదిషా మొహంతీ (ఒడిసీ) గురు నైన శాస్త్రి (భరతనాట్యం) గురు పెండేకంటి సునీత (కూచిపూడి) రాజేష్ చావలి (కూచిపూడి) చందన వేటూరి (కూచిపూడి, భరతనాట్యాలు) గురు భైరవి నెడుంగడి (మోహిని ఆట్టమ్) గురు గణేశ్ వాసుదేవన్ (భరత నాట్యం) అఖిలరావు (భరతనాట్యం) గురు దీపాన్విత సేన్ గుప్త (కథక్) సీమ చక్రబర్తి గురు సుప్రియ సుధాకర్, నూతి ప్రసూన (కూచిపూడి ) శిష్యబ్రుందంతో ఒక సరికొత్త సాంప్రదాయంగా రూపొందింది.
భారత ప్రభుత్వ కన్సులేట్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) డాక్టర్ T.V. నాగేంద్ర ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే - "షణ్ముఖ శర్మ గారి గీతాలకు నృత్య రూపం ఇచ్చిన ఈ కళాకారులు ఈ Bay Area ను శివమయం చేశారు. అద్భుతంగా అలరించింది. ఇప్పుడిక్కడ ఉద్యోగాలున్నాయి.. భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ మన ఇండియాలోనే అంటే షణ్ముఖ శర్మకి ఆయన పాదాభివందనం చేశారు. కంబోడియాలోని ఖ్మేర్ తమిళ సంఘం ప్రతినిధి డాక్టర్ రామేశ్వరాన్ని, ప్రదర్శించిన గీతాలకు పెయింటింగ్సు వేసిన దెందుకూరి రఘునాథుని కూడా సత్కరించారు. కాలిఫోర్నియా ప్రభుత్వ ప్రతినిధి Assemblyman Josh Hoover పంపిన అభినందన పత్రాన్ని నాగేంద్ర ప్రసాద్ బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment