కరోనా మహమ్మారిని నుంచి మానవాళిని రక్షించుకునేందుకు.. జరిపే పోరులో విజయం సాధించడానికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా సాధించే లక్ష్యంతో అంతర్జాలంలో సిలికానాంధ్ర హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించింది. సాయిదత్తపీఠం, నాట్స్‌తో పాటు అనేక తెలుగు సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ లక్ష గళార్చనకు తమ సహకారాన్ని అందించాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒకేసారి లక్షమంది హనుమాన్ చాలీసా పఠించడంతో, హనుమాన్ చాలీసా లక్ష గళార్చన కార్యక్రమం గిన్నీస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది.
సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి, ఆరెంజ్ మూన్ సాంకేతిక బృంద సమన్వయకర్త హరి దేవబత్తుని అకుంఠిత కార్యదీక్షతో లక్ష గళార్చన లక్ష్యాన్ని సాధించారు. 50 దేశాల నుంచి హిందు భక్త సమాజం ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. ఇందులో ఎందరో హిందు ప్రముఖులు కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్‌లు ఇది ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనియాడారు. ఒకేసారి ఇంతమంది ఆన్‌లైన్ వేదికగా గళార్చన చేయడంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కి యావత్ భారతీయులంతా గర్వపడేలా చేసింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదనేది ఈ లక్ష గళార్చన నిరూపించిందని... కరోనా పై పోరులో దైవబలం కూడా మానవాళికి తోడుగా ఉండి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యూజెర్సీ సాయిదత్త పీఠం ద్వారా భక్తులను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయడంలో రఘు శర్మ శంకరమంచి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ అందించిన సహకారం కూడా మరువలేనిదని ఆనంద్ కూచిభొట్ల అన్నారు. ఈ విషయంలో నాట్స్ నాయకులు మురళీకృష్ణ మేడిచర్లను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment