‘ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు’ | TTD President YV Subba Reddy Speech At American Association For Physicians Of Indian Origin AAPI | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు: వైవీ సుబ్బారెడ్డి

Published Sat, Jun 25 2022 2:03 PM | Last Updated on Sat, Jun 25 2022 2:48 PM

TTD President YV Subba Reddy Speech At American Association For Physicians Of Indian Origin AAPI - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సొంత రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమెరికాలోని శాన్ అంటోనియో, టెక్సాస్ లో జరుగుతున్న అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఫిజిషియన్స్ అఫ్ ఇండియన్ ఆరిజన్ (AAPI, ఆపి) మహాసభలలో మాజీ లోక్ సభ సభ్యులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య రంగంలో చేపట్టిన, చేపట్టబోతున్న అభివృద్ది గురించి ఆయన వివరించారు. 

ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
►  గ్రామ స్థాయిలో ఇంటింటికీ ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లినిక్‌లో ఒక ఏఎన్‌ఎం, ఒక మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఒక ఆశా వర్కర్‌ను నియమించారు. నాడు-నేడులో భాగంగా 977 పీహెచ్‌సీలు పునరుద్ధరించారు. అదే విధంగా 148 పీహెచ్‌సీలు నిర్మాణంలో ఉన్నాయి. అంతే కాకుండా పట్టణాలలో 556 పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ప్రతీ 30,000 జనాభాకు ఒక అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)తో పాటు అందుకు సరిపడా సిబ్బందిని నియమించారు.

►  ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి నాడు-నేడు కింద  ప్రభుత్వం రూ.12,268 కోట్లను కేటాయించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కళాశాల ఉండేలా రూ.7,880 కోట్ల అంచనా వ్యయంతో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కాలేజీల్లో 1,850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 750 ఎంబీబీఎస్ సీట్లకు 2023-24 అడ్మిషన్ల కోసం 5 కొత్త మెడికల్ కాలేజీలు తెరవబడతాయి.

► సుమారు రూ.43 కోట్ల వ్యయంతో 5 జనరల్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని వైద్య మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను బలోపేతం చేయడం, సమీపంలోనే ప్రజలకు ఎండ్ టు ఎండ్ మెడికల్ కేర్‌ని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

► ఇవే కాకుండా జెనెటిక్స్, బోన్ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, ఇమ్యునాలజీ వంటి అసాధారణ విభాగాలతో కూడిన అత్యాధునిక ప్రపంచ స్థాయి పీడియాట్రిక్ (చిన్న పిల్లల) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ఆంధ్ర & ఉత్తర ఆంధ్రాలలో ఇటువంటి   3 ఆసుపత్రులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా  విజయవాడ  జీజీ హాస్పిటల్‌లో మొదటి జెనోమిక్ ల్యాబ్‌ను ప్రారంభించింది. 

►రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ (WHO/GMP) సర్టిఫైడ్ ఔషధాలను తయారీదారుల నుండి నేరుగా కొనుగోలు చేయడంతో పాటు మొదటిసారిగా బోధనాసుపత్రులలో ఉచితంగా సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్, క్యాత్‌ల్యాబ్‌ సేవలను ప్రారంభించింది.

► డాక్టర్‌ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ,,  ఆరోగ్య బీమా పథకం ద్వారా బీపీఎల్‌  కుటుంబాలకు (ఆదాయ పరిమితి రూ. 5 లక్షలు) వివిధ రకాలైన 2,446 శస్త్ర చికిత్సల కోసం  కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.44 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

► దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నెలకు రూ.10,000 వరకు పెన్షన్ అందిస్తుంది. నెలవారీ రూ.35.01 కోట్ల పంపిణీతో 68,874 మంది వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఆరోగ్య ఆసరా ద్వారా రోగులకు, సామాజిక-ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి వారి కోలుకునే కాలంలో కూడా ప్రభుత్వం రోగికి నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది. 

► ఆరోగ్యశ్రీ కింద కోవిడ్, బ్లాక్ ఫంగస్ రెండింటినీ చేర్చడం ద్వారా ఉచిత కోవిడ్ చికిత్సను అందించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. 

► క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 7 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం గుర్తించింది. మొదటి దశలో 3 ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రానికి రూ.500 కోట్లు కేటాయించారు. టాటా ట్రస్ట్‌ సహకారంతో  రూ.190 కోట్ల వ్యయంతో తిరుపతిలో అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్ స్థాపించబడింది. అన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కోవడానికి హోబీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రేడియేషన్, కీమో, సర్జికల్ ఆంకాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్... మొత్తం 26 మెడికల్ కాలేజీలలో (పాత మరియు కొత్త) దశలవారీగా ఏర్పాటు చేయబడుతుంది.

► రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద నియామక ప్రక్రియ ద్వారా  35,998 మంది వైద్య సిబ్బందిని నియమించారు.

►108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ (24 గంటల ఎమర్జెన్సీ హెల్త్ ట్రాన్స్‌పోర్టేషన్‌ సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ సలహా సేవలను అందించడానికి మండలానికి ఒకటి చొప్పున 656 మొబైల్ మెడికల్ యూనిట్లు (104 వాహనాలు), 24x7 ఆరోగ్య సేవను అందించడానికి 27 మంది వైద్య అధికారులు మరియు 306 కాల్ ఎగ్జిక్యూటివ్‌లతో 104 టోల్-ఫ్రీ కాల్-సెంటర్, సమగ్ర కంటి సంరక్షణ మరియు దృష్టి లోపాలను నివారించడానికి డాక్టర్ YSR కాంతి వెలుగు, మెటర్నిటీ మోర్టాలిటి రేట్ తగ్గించడానికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఏర్పాటు చేశారు. 

► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ (APNRTS) అధ్యక్షులు  వెంకట్. ఎస్‌ మేడపాటి మాట్లాడుతూ.. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నారైలు ముందుకువచ్చి రాష్ట్రానికి తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌  ఇంచార్జ్ డాక్టర్‌ హరికృష్ణ , డాక్టర్‌ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఉత్తర అమెరికాలో రాష్ట్ర  ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, నాటా అధ్యక్షులు  శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, సీ సుబ్బా రెడ్డి, సీవీబీసీ  డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 23 నుండి 26వ తేదీ వరకు జరిగే  ఈ మహాసభల కార్యనిర్వాహకవర్గం  డాక్టర్‌ అనుపమ గోటిముకుల- ప్రెసిడెంట్, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీషియాలజీ, రవి కొల్లి- రాబోయే ప్రెసిడెంట్ సైకియాట్రీ, డా.  సతీష్ కతుల. VP- Hem/Onc, డా. మెహర్ మేడవరం- కార్యదర్శి, IM, డా. లోకేష్ ఎడారా BOT- అలెర్జీ ఇమ్యునాలజీ, డా.  శ్రీనగేష్ పలువోయ్ BOT- అలెర్జీ ఇమ్యునాలజీ, డా.  సునీల్ కాజా- BOT కార్డియాలజీ, డా. సుధాకర్ జొన్నలగడ్డ మాజీ అధ్యక్షులు, జి.ఐ, డా. సురేష్‌రెడ్డి - మాజీ అధ్యక్షులు, డా.  సీనింగ్ గంగాసాని- పాస్ట్ BOT, జార్జియా స్టేట్ మెడికల్ బోర్డ్, డా.  రఘు లోలాభట్టు BOT- IM, డా. సుజీత్ పున్నం RD, కార్డియాలజీలు ఉన్నారు.
చదవండి: ఆటా వేడుకలకు వేళాయే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement