చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థినులు ఆందోళనకు దిగిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురంలో సోమవారం చోటు చేసుకుంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అంబాపురం పంచాయతీ నాల్గో రోడ్డులోని ఓ భవనంలో నవోదయ కాలేజీ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్స్ కళాశాల ఆరు సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా రవీంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కాలేజీలో భద్రాచలం, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 120 మంది బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం స్టాఫ్ నర్స్ కోర్సులు అభ్యసిస్తున్నారు.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కాలేజీ హాస్టల్‌లో 80 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. వారంతా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు కావడంతో కాలేజీలోనే ఉండి చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని(19) ఈ ఏడాది జనవరిలో కాలేజీలో చేరింది. కొద్ది వారాల కిందట ఆ విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను కాలేజీలో చదవనని, ఇంటికి వచ్చేస్తానని చెప్పింది.
దీంతో ఆ విద్యార్థిని కుటుంబం నగరంలో నివాసం ఉంటున్న తమ దూరపు బంధువుకు విషయం చెప్పి కాలేజీకి వెళ్లి రావాలని కోరింది. దీంతో కాలేజీకి వచ్చిన సదరు వ్యక్తికి ఆ విద్యార్థిని కాలేజీలో జరుగుతున్న కొన్ని వ్యవహారాల గురించి తెలిపింది. విద్యార్థినితో పాటు మరికొంత మంది కూడా ఇదే రీతిలో చెప్పడంతో వారు టీసీ ఇచ్చేయాలని కోరారు. అయితే ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో వ్యవహారం కాస్త బయట పడింది.
కాలేజీ ఎదుట ఆందోళన..
విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు సోమవారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి తమను లైంగికంగా వేధిస్తున్నాడని, ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నాడని విద్యా ర్థినులు వాపోయారు. కనీసం తమ తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడనివ్వడం లేదని, ఎవరికై నా చెబితే తమకు ఇంటర్నెల్ మార్కులు తగ్గిస్తారనే భయంతో తాము ఇన్నిరోజులు ఈ విషయాలను బయటకు చెప్పకుండా నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలేజీలో బయట నుంచి ముగ్గురు లెక్చరర్లు వచ్చి క్లాసులు చెబుతున్నారని, రాత్రి 10, 11 గంటలకు తాను క్లాస్ తీసుకుంటానిని చెబుతారని.. ఆ సమయంలో అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, చెప్పుకోలేని చోట తాకడం చేస్తుంటారని, అసభ్యకరంగా చాటింగ్ చేస్తుంటారని వివరించారు. ఈ విషయంపై విద్యార్థినులు గతంలో పలు మార్లు అభ్యంతరం వ్యక్తం చేశామని చెబుతున్నారు. అయినా ప్రిన్సిపాల్ ఇవేమి పట్టించుకోకుండా రాత్రి వేళ కూడా క్లాసులు చెబుతానని చెప్పడం విద్యార్థినుల ఆరోపణలకు బలం చేకూర్చిందని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్..
ఘటనపై రంగంలోకి దిగిన కొత్తపేట పోలీసులు విద్యా ర్థినులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్‌పై చేస్తున్న ఆరోపణలతో వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడంతో పాటు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరో వైపు ప్రిన్సిపాల్ తీరుపై తెలంగాణ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment