వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఎదురువుతున్న పోటీని తట్టుకొని అత్యున్నతంగా ఎదిగే విధంగా నూతన డిగ్రీ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ఆనర్స్ డిగ్రీ కోర్సు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దటానికి అండగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆయా విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్నాయి. తద్వారా డిగ్రీ అభ్యాసంలోనే ఆయా రంగాలకు చెందిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందేందుకు అక్కడ అవకాశముంటుంది. అదే కోవలో ఏపీలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను తీసుకొస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించి అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి పరిధుల్లో ఉన్న కళాశాలలు విస్తృతంగా ప్రచారం చేశాయి. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకూ గడువును పొడిగించింది.
సబ్జెక్టులు ఇలా..
నూతన డిగ్రీ విధానంలో ఒక సింగిల్ మేజర్ సబ్జెక్ట్, మరో మైనర్ సబ్జెక్ట్‌ను విద్యార్థి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లోని కోర్సుల్లో సుమారు 190కు పైగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్‌లు.. మరో 80 వరకూ మైనర్ సబ్జెక్ట్‌లను అందిస్తున్నారు. అందులో కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 150కు పైగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మైనర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థికి దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశముండటంతో ఉన్నత విద్యామండలి నిర్ధారించిన మైనర్ సబ్జెక్ట్‌లే కాకుండా ఇంకా అధికంగా సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశముందని సీనియర్ అధ్యాపకులు చెబుతున్నారు. డ్యాన్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి సబ్జెక్ట్‌లను సైతం మైనర్ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవచ్చని వివరిస్తున్నారు.
ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ కోర్సులు
● విద్యార్థులు సమగ్ర విషయ పరిజ్ఞానం కోసం ఇంటర్ డిసిప్లినరీ కోర్సు, మల్టీ డిసిప్లినరీ కోర్సులు కూడా ఉంటాయి.
● ఇంటర్‌లో బైపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ బీఎస్సీ ఆనర్స్‌లో జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిషరీస్ సబ్జెక్టుల్లో ఒక దానిని మేజర్ సబ్టెక్టుగా ఎంపిక చేసుకొని పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, వంటి ఆర్ట్స్ గ్రూపుల్లోని సబ్జెక్ట్‌లను మైనర్ సబ్జెక్ట్‌లుగా ఎంపిక చేసుకోవచ్చు.
● అలాగే ఇంటర్‌లో ఎంపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ ఆనర్స్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంవ్యూటర్స్, స్టాటిస్టిక్స్, జియాలజీల్లో ఒక దానిని మేజర్ సబ్జెక్టుగా ఎంచుకుని మైనర్ సబ్జెక్టుగా డేటాసైన్స్, ఆర్జిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్స్ తదితర సబ్జెక్టుల్లో ఒక దానిని అభ్యసించవచ్చు.
● బీకాం ఆనర్స్‌లోనూ ఇదే రీతిలో సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకునే వెసులుబాటు నూతన విధానంలో డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 120 వరకూ వివిధ కోర్సులను అందించే కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో 90 వరకూ కళాశాలలు సాధారణ డిగ్రీ కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో సుమారు ఎనిమిది వరకూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా మిగిలినవి ప్రైవేట్, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ కళాశాలల్లో సుమారుగా 20 వేల వరకూ మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థులకు అవకాశముంది.
నూతన విధానంతో ప్రయోజనాలు
డిగ్రీ నూతన ఆనర్స్ విధానంలో చదివే విద్యార్థులకు విస్తృతమైన ప్రయోజనాలున్నాయి. ఆనర్స్ విత్ రీసెర్చ్ చేస్తే పోస్టు గ్రాడ్యుయేషన్ చేయకుండా నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశముంది. అలాగే నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు చేసిన విద్యార్థి పీజీ ఏడాదిలోనే పూర్తి చేయవచ్చు. డిగ్రీ చదివే విద్యార్థులు మేజర్ సబ్జెక్ట్‌కు సంబంధించి మొత్తం 21 పేపర్లు, మైనర్ సబ్జెక్ట్‌కు సంబంధించి ఆరు పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థి మొదటి ఏడాది తరువాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, ద్వితీయ సంవత్సరం తర్వాత షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అనంతరం సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
– డాక్టర్ వీ నారాయణరావు, విద్యావేత్త
ప్రవేశాల షెడ్యూల్ ఇలా..
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకూ గడువును పెంచారు.
విద్యార్థులు ఏపీఎస్‌సీహెచ్‌ఈ.జీఓవీ.ఈన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లేదా దగ్గరలోని డిగ్రీ కళాశాలలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జూలై 15 నుంచి 19వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
జూలై 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. అదే రోజు తరగతులు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment