మాటల మాంత్రికులు.. జీవితాలను నిలబెడతారు | Sakshi
Sakshi News home page

మాటల మాంత్రికులు.. జీవితాలను నిలబెడతారు

Published Tue, Dec 19 2023 1:06 AM

టెలీమానస్‌ కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సైకాలజిస్టులు (ఫైల్‌) - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): వారి మాటలు తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆత్మన్యూనతాభావం నుంచి బయటపడేలాచేస్తాయి. ఇక జీవితం వృథా అనేకునే వారికి మళ్లీ ఆశలు చిగురింప చేస్తాయి. వాళ్లే కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు ఉరుకుల పరుగుల జీవనంలో మానసిక కుంగుబాటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇలా అనేక కారణాలతో ఆత్మ న్యూనతాభావానికి గురవుతున్నారు. దీంతో ఇప్పుడు వీరి పాత్ర విస్తృతమైంది. ప్రభుత్వం టెలీమానస్‌ వికాస కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్కడ 24 గంటలు కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు వారిలోని బాధను పోగొట్టి జీవితంపై ఆశలు వికసింప చేస్తారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని టెలీ మానస్‌ వికాస కేంద్రం ఇలాంటి సేవలే అందిస్తోంది.

14416 నంబర్‌కు కాల్‌ చేస్తే చాలు

ఈ టెలీ మానస్‌ వికాస కేంద్రంలో సేవలు పొందాలనుకునే వారికోసం దేశ వ్యాప్తంగా 14416 టోల్‌ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. ఆత్మన్యూనతాభావంతో ఉన్న వారు ఆ నంబరుకు కాల్‌ చేస్తే, మన రాష్ట్రానికి సంబంధించిన వారైతే ఈ కేంద్రానికి కనెక్ట్‌ అవుతుంది. ఇక్కడ విధులు నిర్వహించే కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు కాల్‌ చేసిన వారి సమస్యను తెలుసుకుని వారికి తమ మాటలతో ఉపశమనం కలిగిస్తారు. అలా 15 నుంచి 20 నిమిషాల పాటు వారికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్‌ ఇస్తారు. కొందరికి 30 నిమిషాల వరకూ కూడా కౌన్సెలింగ్‌ ఇస్తామని సైకాలజిస్టులు చెబుతున్నారు.

మూడు షిఫ్టుల్లో సైకాలజిస్టులు

ఈ కేంద్రంలో మూడు షిఫ్టుల్లో సైకాలజిస్టులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి షిఫ్టులో 8 మంది చొప్పున, మూడు షిఫ్టుల్లో 24 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది బెంగళూరులోని నిమ్‌హాన్స్‌లో శిక్షణ పొందారు. ఎయిమ్స్‌ మెంటల్‌ హెల్త్‌ సపోర్టుగా వ్యవహరిస్తోంది. ఈ సెంటర్‌ నుంచి తెలుగు, ఇంగ్లిషుతో పాటు మరో భాషలో కూడా కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఐఐఐటీ వారు టెక్నికల్‌ సపోర్టు ఇస్తున్నారు.

ఆధునిక సమాజంలో..ఉరుకుల పరుగుల జీవనంలో ఒత్తిడిని తట్టుకోలేక మానసికంగా కృంగి, కృశించిపోయే బాధాసర్పదష్టులకు తమ చల్లని వెన్నెల లాంటి మాటలతో ఉపశమనం కలిగించే మాటల మాంత్రికులు వారు. ఆత్మ న్యూనతా భావంతో ఆత్మార్పణకు సన్నద్ధమయ్యే వ్యదార్థ హృదయులకు జీవితంపై కొంగొత్త ఆశలు చిగురింజేసి నూతన జీవితానికి దారి చూపే దేవతలు వారు. సున్నితంగా హితవాక్యాలు పలికే శ్రేయోభిలాషులు వారు. చేయవలసిందల్లా ఒక్కటే 14416 నంబర్‌కు కాల్‌ చేస్తే చాలు..

ఎంతో ప్రయోజనకరం

మానసిక ఒత్తిడులకు గురైన వారికి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేసిన టెలీమానస్‌ వికాస కేంద్రం ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం సమాజంలో అనేక మంది తీవ్రమైన మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా ఈ కేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామం.

–డాక్టర్‌ గర్రే శంకరరావు, ఉపాధ్యక్షుడు, ఏపీ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌

ఈ సమస్యలే ఎక్కువ..

  • కుటుంబ కలహాలతో ఒత్తిళ్లకు గురవుతున్న వారు
  • ప్రేమ విఫలం అయిన వారు
  • అక్రమ సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నం అయినవారు
  • ఆత్మీయ స్నేహితులు, కుటుంబసభ్యులు మరణించినప్పుడు ఒత్తిడికి గురవుతున్న వారు
  • మొబైల్స్‌కు అడిక్ట్‌ అయి చదువుపై, పనులపై శ్రద్ధ పెట్టలేక పోతున్నవారు

ఇలా అనేక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెందిన వారు టెలీ మానస్‌ కేంద్రానికి ఫోన్‌ చేసి ఉపశమనం పొందుతున్నారు.

1/1

Advertisement
Advertisement