క్యాష్‌ లెస్‌.. యూజ్‌ లెస్‌! | - | Sakshi
Sakshi News home page

క్యాష్‌ లెస్‌.. యూజ్‌ లెస్‌!

Published Tue, Feb 18 2025 1:41 AM | Last Updated on Tue, Feb 18 2025 1:40 AM

క్యాష

క్యాష్‌ లెస్‌.. యూజ్‌ లెస్‌!

నూజివీడుకు చెందిన పెన్షనర్‌ అబ్దుల్‌(70) ఇటీవల పక్షవాతానికి గురయ్యాడు. నగరంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి రాగా, అక్కడ ఈహెచ్‌ఎస్‌లో సేవలు అందుబాటులో లేవని చెప్పడంతో డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సి వచ్చింది. వైద్యానికి రూ.2.50 లక్షలు ఖర్చు చేశాడు. ఇలా ఎందరో ఉద్యోగులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు.

గన్నవరానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి(64)కి ఇటీవల హార్ట్‌బీట్‌ తగ్గింది. ఆస్పత్రికి వెళ్లగా ఫేస్‌మేకర్‌ వేయాలని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ పథకంలో వేసేవాళ్లు. ఇప్పుడు అతనికి ఈహెచ్‌ఎస్‌ పథకంలో చేయలేమని చెప్పడంతో అప్పు చేసి డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. అదేమంటే రీయింబర్స్‌మెంట్‌ వస్తాయిగా అంటున్నారని ఆ ఉద్యోగి వాపోతున్నారు. ఆ ఫైల్‌ పెడితే ఎప్పుడు వస్తాయో, ఎంత వస్తాయో తెలియదంటున్నాడు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం మిథ్యగానే మారింది. గత ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని పటిష్టంగా అమలు చేయగా, నేడు కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తామని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించినా, ప్రభుత్వంలో కనీస స్పందన కనిపించలేదు. దీంతో ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌ కార్డు తీసుకుని ఆస్పత్రులకు వెళ్తే, ఈ కార్డుపై తాము వైద్యం చేయడం లేదని, డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పడంతో అప్పులు చేసి మరీ చెల్లించాల్సిన దయనీయ స్థితి నెలకొంది. దీంతో చేసేది లేక చిన్న తరగతి ఉద్యోగులు ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తుంచాల్సి వస్తోంది. మరికొందరు తక్కువ రేటులో వైద్యం అందుతుందని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలిపోతున్నారు.

45 రోజుల కిందటే..

జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 45 రోజుల కిందటే ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం నిలిపివేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆషా) ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించి చర్చించిన అనంతరం మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. నాటి నుంచి జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నింటిలో ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిచిపోయాయి. గతంలో నిర్వహించి ఉచిత ఓపీ పరీక్షలను కూడా నిలిపివేశారు. దీంతో జిల్లాలోని వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ జీతాల నుంచి ఈహెచ్‌ఎస్‌ కోసం కొంత వ్యయం చెల్లిస్తున్నా, వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

ప్రభుత్వ మొండి వైఖరితోనే..

గత ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో ఆ ఏడాది మొదటి క్వార్టర్‌ ఆరోగ్యశ్రీ చెల్లింపులు కూడా జరిపేందుకు వీలుకాలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం జూన్‌లో ఏర్పాటైంది. అంటే జనవరి నుంచి జూన్‌ వరకూ ఆరు నెలల్లో ఆరోగ్యశ్రీ కింద అందించిన సేవలకు గాను రూ.2 వేల కోట్ల వరకూ బకాయి ఉంది. వాటిని చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న రూ.1500 కోట్లు బకాయిలు చెల్లించిందనీ, అలాగే ఇప్పుడు చెల్లించాలని కోరినా స్పందన కొరవడింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిపివేశారు.

అమలయ్యేలా చూడాలి..

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే, ఇది పనికిరాదు డబ్బులు కట్టాలంటున్నారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చూడాలి.

– కె. శ్రీనివాసరావు, ఉద్యోగి

పేరుకే నగదు రహిత వైద్య పథకం

45 రోజులుగా ఈహెచ్‌ఎస్‌ సేవలు బంద్‌

పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే సేవలంటున్న ఆస్పత్రుల యాజమాన్యాలు

ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
క్యాష్‌ లెస్‌.. యూజ్‌ లెస్‌! 1
1/1

క్యాష్‌ లెస్‌.. యూజ్‌ లెస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement