No Headline
లబ్బీపేట(విజయవాడతూర్పు): పంటకు గిట్టుబాటు ధరలేక దిగులు చెందుతున్న మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నేతలపై కేసులు కట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుకు పెనుభారంగా మారిందని తెలిపారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అండగా నిలవడానికి వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడికి కనీస భద్రత ఇవ్వకుండా, అన్యాయంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగిందంటే అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే అన్నారు. నాడు మిర్చి రైతులకు పంటల బీమా అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీకే, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మిర్చి కొనుగోలు చేసి, రైతులకు అండగా ఉండాలని అవినాష్ డిమాండ్ చేశారు.
మీడియాలో తప్పుడు ప్రచారం దుర్మార్గం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
Comments
Please login to add a commentAdd a comment