అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. రూ.1500 ఇస్తారని నమ్మించి.. ఆ అకౌంట్లను సైబర్ నేరాలకు వినియోగిస్తున్న విషయం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన పలువురు మహిళలు, పురుషులు 59వ డివిజన్ శానిటరీ విభాగంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంటారు. అయితే అక్కడ శానిటరీ మేస్త్రిగా పనిచేసే డానియేల్ అతని కుమారుడు రాముకు ఆన్‌లైన్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇలా ఆమెతో చాటింగ్‌లో ఉన్న రాముకు వన్‌టౌన్‌లోని బీబీఎస్ బ్యాంక్‌లో అకౌంట్‌లు ఓపెన్ చేయిస్తే రూ.1500 డబ్బులు వస్తాయని సదరు మహిళ రాముకు చెప్పింది. మనం అలా డబ్బులు బాగా సంపాదించి.. విదేశాలకు కూడా వెళ్లవచ్చని నమ్మించింది. దీంతో రాము తన తండ్రి డానియేల్ పనిచేసే కార్యాలయంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఈ విషయాన్ని చెప్పి వారి వద్ద నుంచి ఆధార్‌కార్డ్‌లు, ఫొటోలను సేకరించాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.1500 వస్తాయనే ఆశ చూపి పలువురు కార్మికులతో గతేడాది బ్యాంకు అకౌంట్‌లను ఓపెన్ చేయించి వారికి రూ.1500 చొప్పున నగదు అందించారు. వారికి వచ్చిన బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లను వారే తిరిగి తీసేసుకున్నారు.
సైబర్ క్రైం నోటీసులతో..
అయితే ఇలా ఖాతాలు తెరిచిన పీట్ల వెంకటేశ్వరరావు, పీట్ల దుర్గాభవాని, వేముల సుశీల, వేముల ఇస్సాక్‌లకు ఈ నెల 10వ తేదీన మహారాష్ట్రలోని జలగాం వద్ద జరిగిన ఓ సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి నోటీసులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన వారు విషయం తెలుసుకోగా వారి నలుగురి ఖాతాలలో సుమారు రూ.17.50 లక్షలు జమ అయి.. వాటిని తీసినట్లుగా ఉంది. వెంటనే వారు శానిటరీ మేస్త్రి డానియేల్, అతని కుమారుడు రాములను నిలదీయగా వారు పొంతన లేని సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం వరకే తమకు తెలుసని అంత డబ్బులు ఎలా వచ్చాయో.. ఎలా పోయాయో తమకు తెలీదని చెప్పడంతో బాధితులు సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇలా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసిన మరికొంతమంది కార్మికులకు కూడా ఇదే విధంగా పోలీసుల నుంచి నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఎంతమంది అకౌంట్‌లు ఓపెన్‌చేశారు.. ఎంతమందికి నోటీసులు వచ్చాయనే వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై బాధితుల నుంచి పూర్తి సమాచారం తీసుకున్న తరువాత కేసు నమోదు చేసి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
డబ్బు ఆశ జూపి పారిశుద్ధ్య కార్మికులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిన వైనం
ఒక్కొక్కరి ఖాతాలో రూ. 17లక్షలు వేసి, విత్ డ్రా
మహారాష్ట్ర నుంచి ఖాతాదారులకుసైబర్ క్రైం నోటీసులు
స్థానిక పోలీసులను ఆశ్రయించిన నలుగురు కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment