సాగుదారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కిసాన్ మేళాలో కృష్ణాజిల్లా
కలెక్టర్ డీకే బాలాజీ
ఘంటసాల: సాంకేతికతను సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఘంటసాలలోని వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజోన్ కిసాన్ మేళా మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ పరిశోధనా ప్రాంగణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ అధ్యక్షతన జరిగిన కిసాన్ మేళాను విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏఆర్‌ఎస్, కేవీకే, ఇతర వ్యవసాయ ప్రదర్శన స్టాల్స్, యంత్రాలను పరిశీలించారు. ముందుగా ఏఆర్‌ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు వరి మాగాణుల్లో అపరాల సాగు–సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించడంతో పాటు వివిధ పంటల్లో నూతన వంగడాలు, నూతన పద్ధతులు తెలియజేసి రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అనంతరం ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన వరి మాగాణులలో మినుము, పెసర సాగు యాజమాన్యం, వరి మాగాణులలో మినుమును ఆశించే కాండం గజ్జి తెగులు యాజమాన్యం పుస్తకాలను ఆవిష్కరించారు. రైతులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ, కృష్ణా మండలం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్‌వీవీఎస్ దుర్గా ప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్.పద్మావతి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి నరసింహులు, ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.సత్యప్రియ లలిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment