మైనింగ్ బిల్లులు లేకుండా మెటల్, కంకర రవాణా చేస్తున్న 17 లారీలను జి.కొండూరు మండల పరిధి కట్టబడిపాలెం గ్రామ శివారులో మైనింగ్ ఏడీ వీరాస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘటనా స్థలానికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రషర్లు, క్వారీలపై చర్యలు తీసుకోకుండా కిరాయి కోసం వచ్చిన లారీలపై ప్రతాపం చూపిస్తున్నారని మైనింగ్ అధికారులపై నాయకులు మండిపడ్డారు. బిల్లులు ఇవ్వకుండా మైనింగ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా నిత్యం లారీ యజమానులనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు సక్రమంగా ఉన్న క్రషర్ల, క్వారీలలో రవాణా చేసుకునేందుకు జాబితా ఇవ్వమని అడిగినా మైనింగ్ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. క్రషర్లు, క్వారీల యజమానులు వారి సొంత లారీలకు మాత్రమే బిల్లులు ఇచ్చి తమ లారీలకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ప్రశ్నిస్తే తమ లారీలకు లోడింగ్ ఆపేస్తున్నారని చెప్పారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు ఎంత మొరపెట్టుకున్నా వెనక్కి తగ్గని మైనింగ్ శాఖ అధికారులు ఏడు లారీలను జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో ఏడు లారీలకు ఒక్కొక్క లారీకి రూ. 22,500 చొప్పున జరిమానా విధించి అక్కడి నుంచి పంపారు. మరో మూడు లారీలు సీజ్ చేసిన ప్రదేశంలోనే సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment