గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో క్షయను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కలిసికట్టుగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ)–జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశం జరిగింది. ఎన్‌టీఈపీ కింద చేపడుతున్న టీబీ నియంత్రణ కార్యక్రమాలు, వ్యాధి నిర్థారణ పరీక్షలు, చికిత్స, ఉచిత మందుల పంపిణీ, నిక్షయ్ పోషణ్ యోజన తదితర అంశాలపై సమా వేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో 10 టీబీ యూనిట్ల ద్వారా ఎన్‌టీఈపీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రోగికి చికిత్స సమయంలో నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రతినెలా రూ.వెయ్యి డీబీటీ ద్వారా అందిస్తున్నామన్నారు. క్షయ నియంత్రణలో వినూత్న చర్యలు చేపట్టే దిశగా స్థానిక సంస్థలను ప్రోత్సహించేందుకు టీబీ ముక్త్ పంచాయతీ కార్యక్రమాన్ని కూడా అమలుచేస్తున్నామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, ఐఎంఏ సభ్యులు డాక్టర్ రవీంద్రనాథ్, డీపీవో పి.లావణ్య కుమారి, వాసవ్య మహిళా మండలి సెక్రటరీ డాక్టర్ జి.రశ్మి పాల్గొన్నారు.
జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment