సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. సాయంత్రం 3 గంటల వరకు సాంకేతిక లోపాన్ని సరిచేయలేదు. దీంతో కక్షిదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సప్తమి మంచి రోజు కావడంతో ఎక్కువ మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. వీరంతా నిరాశకు గురయ్యారు. సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియక కొందరు తిరిగి వెళ్లగా మరికొందరు కార్యాలయాల వద్దే వేచి చూశారు. సాయంత్రానికి కూడా సాంకేతిక లోపం తొలగకపోవడంతో చేసేది లేక తిరిగి వెళ్లారు. సిబ్బంది కూడా లోపం ఎక్కడ ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఈ– సైన్ సమస్య
భూముల క్రయ విక్రయాల్లో ఈకేవైసీ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. కక్షిదారులు తొలుత ఈకేవైసీ నిర్థారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పార్టీల సంతకాలు ఆన్‌లైన్ ద్వారా(ఈ–సైన్) సేకరిస్తారు. అయితే ఈ– సైన్ తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు సాంకేతిక లోపం సరిచేసినప్పటికీ.. మరలా కొద్దిసేపటికి నిలిచిపోయింది. రిజి స్ట్రేషన్ డాక్యుమెంట్‌పై పార్టీల సంతకాలు ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా కొంతమంది వద్ద మాన్యువల్‌గా సంతకాలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment