ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆగదని సంచార పశు ఆరోగ్య సేవ (1962) సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఈ నెల 15, 16 తేదీలలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం పంపటంపై 17వ తేదీ నుంచి ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. తాము పని చేస్తున్న సంస్థ అధికారుల తోను, పశు సంవర్థక శాఖ సంచాలకుడితోనూ సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వారు ఆందోళనను కొనసాగిస్తున్నారు. వాట్సాప్ మెసేజ్‌లో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అప్పగించాలని పేర్కొన్నప్పటికీ ఉద్యోగ భద్రతపై భరోసా కల్పించకపోవడంతో వాటిని అప్పగించకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 2022లో ప్రవేశ పెట్టిన సంచార పశు వైద్య సేవ పథకం నిమిత్తం తొలుత 175 వాహనాల (1962)ను, సెకండ్ ఫేజ్‌లో మరో 165 వాహనాలను అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఫస్ట్ ఫేజ్‌లో విడుదల చేసిన 175 వాహనాలకు సంబంధించిన ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ముందుగా ఉద్వాసన పలికింది. సెకండ్ ఫేజ్‌లో విడుదల చేసిన 165 వాహనాల ఉద్యోగులను నేడో రేపో తొలగించనున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
కర్కశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం
గత ప్రభుత్వంలో నియమించిన ఉద్యోగులను అర్థాంతరంగా తొలగించి కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని సంచార పశు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీకే గ్రూప్‌కు చెందిన ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ద్వారా గత మూడేళ్ల నుంచి 1962 సంచార వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాలకు వైద్య సేవలను అందిస్తున్న దాదాపు 2 వేల మంది ఉద్యోగులను తొలగించటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించడానికి బడ్జెట్ లేదని పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పటం సిగ్గుచేటని సిబ్బంది మండిపడుతున్నారు.
కొనసాగుతున్న సంచార పశు వైద్య సిబ్బంది ఆందోళన ఉద్యోగ భద్రతపై అధికారులస్పందన నిల్ వాహనాల అప్పగింతపై తొలగని ప్రతిష్టంభన నేడో రేపో మరో 165 వాహనాల ఉద్యోగులకు ఉద్వాసన
విధులు నిర్వర్తిస్తున్న వారిని తొలగించటమేనా..
నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 2వేల మందిని ఒకే సారి తొలగించడమేనా ఉద్యోగ, ఉపాధి కల్పన అంటూ సంచార పశు ఆరోగ్య సేవ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీకే సంస్థ కాంట్రాక్ట్ అయిపోతే, కొత్తగా వచ్చే మరో సంస్థ అయినా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందే కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు అందించే ఉచిత వైద్య సేవలను నిలిపేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనుషులైతే 108 వాహనానికి ఫోన్ చేస్తారు. మరి మూగజీవాలైన పశువులకు అనారోగ్యం వస్తే ఎవరికి చెప్పుకుంటాయని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అంటూ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment