దళిత మహిళలపై పెరుగుతున్న హింస
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా దళిత మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని అంబేడ్కర్ భవన్‌లో దళిత సీ్త్ర శక్తి (డీఎస్‌ఎస్) 19వ వార్షిక మహాసభ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అధ్యక్షతన బుధవారం జరిగింది. ‘దళిత ఆదివాసి మహిళలపై జరుగుతున్న హింస, మానసిక ఆరోగ్యం – వివిధ కోణాలు’ అంశంపై వక్తలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాకి సునీత మాట్లాడుతూ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దళిత మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. 23 శాతం మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే రెండు శాతం మాత్రమే నిందితులకు శిక్షపడుతోందని తెలిపారు. మహిళలపై హింసలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. అయినప్పటికీ నిత్యం సీ్త్రలపై హింస పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి హింసాత్మక ఘటనలపై దళిత సీ్త్ర శక్తి పోరాడటం అభినందనీయమన్నారు. తొలుత డీఎస్‌ఎస్ జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం మాట్లాడుతూ.. 19 ఏళ్లుగా దళిత, ఆదివాసి సీ్త్రలు, బాలికల కోసం డీఎస్‌ఎస్ చేసిన కార్యక్రమాలను వివరించారు. ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ సరస్వతి అయ్యర్ మాట్లాడుతూ.. సీ్త్రలపై హింస అనేక ప్రభావాలకు గురి చేస్తోందన్నారు. సీనియర్ పాత్రికేయుడు ఎం.విశ్వ నాథరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని సీ్త్ర, పురుష సంబంధాలు హింసాత్మక ఘటనలతో ఉండకూడదన్నారు. హింసకు ఎవరు పాల్పడినా సహించకూడదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు హింసకు గురైతే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనంతరం డీఎస్‌ఎస్ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయుడు శ్యామ్ సుందర్, జీజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, సైకాలజిస్ట్ శ్రావణి కృష్ణకుమారి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాధిక ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు, దళిత మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment