మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు
విజయవాడస్పోర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఎన్‌జీజీవో(నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్) అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలకుమారి తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆమె ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు మార్చి 4, 5 తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, గాంధీనగర్‌లోని ఏపీ ఎన్‌జీజీవో హోంలో క్రీడా, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్, వాకింగ్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్, పాటలు, నృత్యం అంశాల్లో పోటీలుంటాయన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరి, ఏపీ ఏన్‌జీజీవో అసోసియేషన్ మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు రిజిస్ట్రేషన్‌తో మోసం.. వ్యక్తిపై కేసు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఒక వ్యక్తిని మోసం చేసిన వారిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నంకు చెందిన పూసర్ల విశ్వేశ్వర రావు గొల్లపూడి గ్రామంలోని సర్వే నంబర్ 234/1 నందు ఎకరం భూమిని గ్రామానికి చెందిన నూతలపాటి ఉషారాణి వద్ద కొనుగోలు చేశాడు. 2016లో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఏడాది తర్వాత ఆర్‌ఓఆర్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. సదరు భూమిని తాను కోనుగోలు చేయడానికి నెల రోజుల ముందే భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అతను వెంటనే ఉషారాణిని సంప్రదించగా.. భాస్కర్‌రెడ్డికి తాము బాకీ ఉన్నామని, అతని భాకీ చెల్లించి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటామని తెలిపారు. ఉషారాణి, ఆమె భర్త మల్లిఖార్జునరావు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునేందుకు 10 రోజులు గడువు కోరారు. గడువు ముగిసినా భాస్కరరెడ్డికి చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోకపోవడంతో బాధితుడు విశ్వేశ్వరరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉషారాణి, ఆమె భర్త కుట్ర పూరితంగా తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment