విజయవాడలీగల్: బాలికను బెదిరించి, లైంగిక దాడి చేసిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్ట్టు న్యాయమూర్తి వి.భవాని జీవిత కాలం కఠినకారాగార శిక్ష, జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలిక, ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో తన తాత ఇంట్లో ఉంటూ దగ్గరలోని స్కూల్లో చదువుతోంది. ఈ క్రమంలో సాయి అనే యువకుడు పరిచయమయ్యాడు. అప్పుడప్పుడూ ఫోన్‌లో ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. 2022 మే నెలలో రాత్రి సమయంలో సాయి బాలికకు ఫోన్ చేసి బయటకు పిలిచి, లైంగికదాడి చేశాడు. మరలా రెండు రోజుల తరువాత సాయి బయటకు రమ్మని అడుగగా, బాలిక రాను అని చెప్పడంతో మొదటి సారి కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అందరికీ చూపిస్తాను అని భయపెట్టి బయటకు తీసుకొచ్చి మరో ఇద్దరు వ్యక్తులతో కలసి లెంగికదాడి చేసి.. ఎవరికై నా చెపితే చంపుతామని బెదిరించారు. తరువాత బాలిక పిన్ని గమనించి, కడువు ఎత్తుగా ఉందని అడగగా, బాలిక జరిగిన విషయం చెప్పింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి దిశా పోలీస్‌స్టేషన్ ఏసీపీ బి.వి.నాయుడు పటమట దర్శిపేటకు చెందిన సిరిగిరి చంద్రశేఖర్ అలియాస్ సాయి, పటమట లంబాడీ పేటకు చెందిన అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీనుతో పాటు మరో జువైనల్ సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకుని విచారించి, కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో పోక్సో చట్టం ప్రకారం నిందితులైన సిరిగిరి చంద్ర శేఖర్ అలియాస్ సాయి, అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీనుకు మరణించేంత వరకు కఠినకారాగార శిక్ష, సాయికి రూ.32 వేలు, ప్రకాష్‌కు రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా బాధిత బాలికకు జరిమానా నుంచి రూ.30 వేలు, మరో రూ.ఐదు లక్షలను నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment