ఎత్తిపోతల ఎడారి.. పొలాలు తడారి..
పెనుగంచిప్రోలు: నీటి చెమ్మలేకుండా పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం ఎడారిని తలపిస్తోంది. సాగునీరు అందక ఆయకట్టు పొలాలన్నీ తడారిపోతున్నాయి. ఎండుముఖం పట్టిన మొక్కజొన్న, శనగ పైర్లకు నీటి తడులు ఎలా అందించాలో అర్థంకాక రైతులు సతమతం అవుతున్నారు. ఎత్తపోతల పథకానికి మరమ్మతులు పూర్తిచేస్తేనే తమ పొలాలు కళకళలాడతాయని, లేకుంటే సాగు కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో మునేరుకు వచ్చిన భారీ వరదలకు పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురైంది. మునేరు వరదకు పంపుహౌస్ పూర్తిగా నీటిలో మునిగింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ కొట్టుకుపోయాయి. ఎత్తిపోతల పథకం లోపల నాలుగు మోటార్లు, విద్యుత్ సామగ్రి, ప్యానెల్ బోర్డులు తడిసి మరమ్మతులకు గురయ్యాయి. దీంతో పథకం పూర్తిగా మూలన పడింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ డీవీఆర్ బ్రాంచి కాలువ పరిధిలోని పెనుగంచిప్రోలు మేజర్ ఆయకట్టులోని చివరి గ్రామం పెనుగంచిప్రోలు. సాగర్ కాలువకు చివరగా ఉండటంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు సక్రమంగా అందటం లేదు. చివరి భూముల సాగు నీటి కోసం స్థానిక మునేరులో ఐడీసీ ఆధ్వర్యంలో రూ.17.23 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఈ పథకం ఆయకట్టు కింద పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం గ్రామాల పరిధిలోని 2,465.02 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం సాగర్ నీరు లభ్యత లేకపోవటంతో రైతులకు ఎత్తిపోతల పథకం నీరు అవసరమైంది. ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు జరగకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రబీ పంటలకు నీటి వెతలు
ప్రస్తుతం రబీ పంటలు మొక్కజొన్న, శనగ సాగుకు నీటి అవసరం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్న సాగుకు నీరు అవసరం చాలా ఎక్కువ. నీరు లేక పంట వడలిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ మోటార్లు ఏర్పాటు చేసి నీటి తడులు అందించి పైరును కాపాడుకుంటున్నామని, ఎకరానికి మరో రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అదనంగా ఖర్చవుతోందని పేర్కొంటున్నారు. ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేస్తేనే తమ వెతలు తీరతాయని స్పష్టంచేస్తున్నారు.
మరమ్మతులకు నోచుకోని పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం నీరు అందక మొక్కజొన్న, శనగ పంటలు ఎండుముఖం 2,465 ఎకరాల్లో రైతుల కన్నీటి సాగు
ఎత్తిపోతల పథకానికి తక్షణ మరమ్మతుల కోసం రూ.6 లక్షలు అవసరమని ఏపీఎస్‌ఐడీసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. అయితే మరమ్మతులకు సుమారుగా రూ.15 లక్షల వరకు అవసరమని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్ లక్ష్మీశ దృష్టికి రైతులు సాగునీటి ఇబ్బందులను తీసుకెళ్లారు. ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకం మరమ్మతుల పథకానికి మరమ్మ తులు చేయాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.
ఎత్తిపోతల ఎడారి.. పొలాలు తడారి..
Comments
Please login to add a commentAdd a comment