భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో డ్వాక్రా రుణాల పేరుతో తమను ఆర్పీ, సీఓ మోసగించారని పలువురు మహిళలు ఆరోపించారు. వారి కథనం మేరకు.. టేకోవర్ గ్రూప్స్ ఉన్నాయని, వాటిలో చేరి రూ.2 లక్షలు పొదుపు చేస్తే బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయని వైఎస్సార్ కాలనీకి చెందిన పది మంది మహిళలను రిసోర్స్ పర్సన్ బూదాల రాణి, కమ్యూనిటీ రాజేష్ నమ్మించారు. వారి వద్ద పొదుపు రూపంలో రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కట్టించారు. అనంతరం ఆ మహిళల వద్ద ఉన్న బ్యాంకు డాక్యుమెంట్లను రాణి, రాజేష్ తీసుకుని వాటిపై ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ వచ్చే సమయానికి డబ్బు కట్టిన మహిళలను తప్పించి, లోన్ కింద వచ్చిన మొత్తాని వారిద్దరూ వాడేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అదేమని అడిగితే ‘మీ డాక్యుమెంట్లతో లోన్ కోసం పెట్టాం కాబట్టి రూ.లక్షకు రూ.5 వేల కమీషన్ ఇస్తామని, తీసుకుని సైలెంట్‌గా ఉండాలని అంటు న్నారని పేర్కొన్నారు. బ్యాంక్ రుణంగా ఇచ్చిన రూ.20 లక్షలు, తాము రూ.2 లక్షల చొప్పున చెల్లించిన పొదుపు సొమ్ము ఇవ్వకుండా రిసోర్సు పర్సన్ రాణి, కమ్యూనిటీ ఆర్గనైజర్ రాజేష్ మోసం చేశారని బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పలువురు మహిళలు గురువారం సాయంత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు.