గ్రామీణ వైద్యులపై దుష్ప్రచారాలు తగదు
హనుమాన్‌జంక్షన్ రూరల్: దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, స్వయం ఉపాధి పొందుతున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై అవాస్తవాలను దుష్ప్రచారం చేస్తున్నారని కృష్ణాజిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.వెంకట రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నూజివీడు రోడ్డులోని పౌల్ట్రీ ఫ్మార్మర్స్ వెల్ఫేర్ సిండికేట్ హాల్‌లో హనుమాన్‌జంక్షన్ ఏరియా గ్రామీణ వైద్యుల సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాజు, రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్ అధికంగా వాడుతున్నారనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించి జీవనోపాధి పొందుతున్న ఆర్‌ఎంపీల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే తలంపు మంచిది కాదన్నారు. దీనిపై మరింత విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు అనంతపురంలో ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకు ముందుగా ప్రభ హాస్పిటల్ (ఏలూరు) ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్ల వైద్య నిపుణడు డాక్టర్ సునీల్ సందీప్ ఆర్‌ఎంపీలకు పలు ప్రాథమిక వైద్య సేవలపై అవగాహన కల్పించారు. సంఘం జిల్లా కోశాధికారి రంగారావు, హనుమాన్‌జంక్షన్ ఏరియా అధ్యక్షుడు కె.నరసింహారావు, కార్యదర్శి కోటా చైతన్య, కోశాధికారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment