పన్నుల పెంపును నిలిపేయాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు సంఘాల నేతలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఏప్రిల్ నుంచి ఆస్తి పన్నుతో సహా పన్నుల పెంపును నిలిపి వేయాలని, కేపిటల్ విలువపై ఆస్తి పన్ను లెక్కించడానికి ఉద్దేశించిన సవరణ చట్టం 44/2020ని తక్షణమే రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏపీ పౌర సమాఖ్య, ట్యాక్స్‌పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్యాక్స్‌పేయర్స్ సంఘ అధ్యక్షుడు వి.సాంబిరెడ్డి అధ్యక్షతన మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఆస్తిపన్నును సమీక్షిస్తామని టీడీపీ వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పన్నుల పెంపుదలను సమీక్షించలేదని, చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని సూచించారు. లేటుగా చెల్లించే వారిపై 24 శాతం పెనాలిటీ వసూలు చేస్తున్నారని, ఇంత ఏ ఆర్థిక సంస్థ వసూలు చేయడం లేదన్నారు. ఆస్తిపన్నును మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా పరిగణించరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచే స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని కోరారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.ఆంజనేయులు మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను పెరుగుదలను తక్షణమే నిలిపి వేయాలని కోరుతూ సీఎంకు, మున్సిపల్ శాఖా మంత్రికి ఈ నెల మొదట్లోనే లేఖను రాశామన్నారు. 44/2020 చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, కుదరకపోతే చట్టాన్ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. పెనాల్టీ లేకుండా మే నెల వరకు చెల్లించడానికి అవకాశం ఇవ్వాలన్నారు. నీటి పన్ను, డ్రైనేజి పన్నులపై 7 శాతం పెంపుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అన్ని అసోసియేషన్లు సీఎంకు, మున్సిపల్ శాఖామంత్రికి లేఖలు రాయాలని, ఇవే డిమాండ్లతో ఏప్రిల్ 9వ తేదీన ధర్నా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. కాలనీ అసోసియేషన్ల సమాఖ్య నాయకులు వెంకటేశ్వరరావు, అన్నె భాస్కరరావు, వి.రామారావు, బెఫీ నాయకుడు ఆర్.అజయ్‌కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.