
ఆమ్రపాలి బోట్ పునఃప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు సంబంధించి భవానీపురంలోని బెరంపార్క్‌లోగల బోటింగ్ పాయింట్ వద్ద ఆధునికీకరించిన ఆమ్రపాలి బోట్ సర్వీస్‌ను ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరమ్మతులకు గురైన ఈ బోట్ గత రెండేళ్లుగా పక్కన ఉందన్నారు. దీనిని ఆధునికీకరించి, అధిక సంఖ్యలో పర్యాటకులు ప్రయాణించేలా రూపకల్పన చేశామని తెలిపారు. విశాలమైన సీటింగ్, ప్రథమ చికిత్స సదుపాయం, భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బోటు కృష్ణానదిపై రోజుకు మూడు ట్రిప్పులు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తిరుగుతుందని చెప్పారు. పర్యాటకులు ఆన్‌లైన్ లేదా బెరంపార్క్‌లోని టికెట్ కౌంటర్ వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏపీటీడీసీ విజయవాడ డీవీఎం పి. కృష్ణచైతన్య, బెరంపార్క్, బోటింగ్ మేనేజర్లు కె. శ్రీనివాస్, నాగరాజు, మన్నం కొండయ్య, బోటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.