రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలో రోజురోజుకు పెరుగుతున్న హైస్పీడ్ రైళ్ల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్వేశాఖ ట్రాక్‌ల ఆధునికీకరణ దిశగా చర్యలు చేపట్టారు. ఈ దిశగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో హైస్పీడ్ రైళ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు ప్రధాన మార్గాల్లో ట్రాక్‌ల ఆధునికీకరణ పనులను చేపట్టారు. విజయవాడ డివిజన్‌లో ప్రధానంగా 1,070.83 కిలో మీటర్ల(టీకేఎం) మేర ట్రాక్‌లు ఉన్నాయి. ప్రధాన మార్గంలోని ఇతర ట్రాక్‌లతో కలుపుకొని మొత్తంగా 2,228.35 ట్రాక్ కిలో మీటర్లు ఉన్నాయి. వీటి గరిష్ట వేగం ఒక్కొక్క సెక్షన్‌లో ఒక్కొక్క విధంగా సాధారణ రైళ్ల నిర్వహణకు తగినట్టుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో వందేభారత్, అమృత్ భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్ల ప్రవేశంతో ట్రాక్‌లు సామర్థ్యం తట్టుకునేలా గంటకు 110 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్ల గరిష్ట వేగానికి తగినట్లుగా ట్రాక్‌ల ఆధునికీకరణ దిశగా డివిజన్ అధికారులు చర్యలు చేపట్టారు.
పనులు వేగంగా పూర్తిచేసేలా ప్రణాళికలు
విజయవాడ డివిజన్‌లో ప్రధాన మార్గాలైన గూడురు – విజయవాడ – దువ్వాడ మార్గంతో పాటుగా విజయవాడ – కొండపల్లి సెక్షన్లలో ఇప్పటి వరకు గంటకు 130 కిలో మీటర్ల గరిష్ట వేగ సామర్థ్యంతో 1,128.76 టీకేఎం ఆధునికీకరించారు. దీంతో డివిజన్‌లో 130 కిలోమీటర్ల సామర్థ్యంతో 58 శాతం ట్రాక్‌ల ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. వీటితో పాటుగా బ్రాంచ్ లైన్‌లు అయిన నిడదవోలు, భీమవరం – నర్సాపూర్ – గుడివాడ – మచిలీపట్నం, కాకినాడ పోర్టు–సామర్లకోట సెక్షన్‌లో 473.4 టీకేఎంలు గంటకు 110 కిలో మీటర్ల రైళ్ల వేగాన్ని నిర్వహించేందుకు అప్‌గ్రేడ్ చేశారు. దీంతో డివిజన్‌లో ఇప్పటి వరకు 1,761 ట్రాక్ కిలోమీటర్లతో 80 శాతం ట్రాక్‌ల అప్‌గ్రేడ్ పనులు పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఇతర అన్ని సెక్షన్‌లలో కూడా ట్రాక్‌ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.
ఇంజినీరింగ్ అధికారుల కృషి..
80 శాతం ట్రాక్‌ల పునరుద్ధరణ
హైస్పీడ్ రైళ్ల నిర్వహణ సజావుగా జరిగేలా ట్రాక్‌ల అప్‌గ్రేడ్ పనులు చేపట్టాం. ట్రాక్‌ల బలోపేతం, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఆధునిక యంత్రాలతో పనులు చేస్తున్నాం. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్‌లు, స్లీపర్‌లను అనుసంధానం చేసేందుకు ‘పాండ్రాల్ రహీ ఫాస్టెనింగ్’, ‘వోస్లోహ్ ఫాస్టెనింగ్’ వంటి కొత్త ఫిటింగ్‌లను ఉపయోగించడంతో 12 ఏళ్ల పాటు మ్యానువల్ జోక్యం లేకుండా ట్రాక్‌లు దృఢంగా ఉంటాయి. టీఆర్టీ యంత్రాన్ని ఉపయోగించి గోదావరి వంతెనపై గడువు ముగిసిన స్లీపర్‌లను నిర్ణీత సమయంలోనే విజయవంతంగా పునరుద్ధరించాం. రానున్న రోజుల్లో అన్ని సెక్షన్‌లలో ట్రాక్‌ల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం.
– ఎస్.వరుణ్‌బాబు,
సీనియర్ డీఈ
ప్రధాన మార్గంలో 130 కి.మీ. సామర్థ్యంతో 1,287 టీకేఎం పనుల పూర్తి
బ్రాంచ్ లైన్‌లతో 110 కి.మీ.సామర్థ్యంతో 473 కి.మీ. ట్రాక్‌ల ఆధునికీకరణ
విజయవాడ డివిజన్‌లో అంతటా 1/4 వంతు నాసిరకం మట్టితో ట్రాక్‌ల నిర్మాణం జరిగింది. తరచూ వర్షాలకు మట్టి కుంచించుకుపోవడం, జారి పోవడం జరుగుతుండేవి. దీంతో తరచూ ట్రాక్‌ల పటిష్టత దెబ్బతింటుండేది. ఇటువంటి పరిస్థితుల్లో తరచూ ట్రాక్‌ల పటిష్టతను పర్యవేక్షించడం, లోపాలను లోతుగా పరిశీలించి ట్రాక్‌ల పునర్నిర్మాణ పనులు చేపడ్డం ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందికి సవాలుతో కూడి ఉండేది. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వేలోనే మొదటిసారిగా మ్యానువల్ జోక్యం లేకుండా ట్రాక్‌ల డీప్ స్క్రీనింగ్ కోసం డివిజన్‌లో ఒక డీసీఎం(బ్యాలెస్ట్ క్లీనింగ్ మెషిన్)ను ఏర్పాటు చేసుకుంది. ఈ ఆధునిక మిషన్‌తో 30 రోజుల్లో జరిగే పనులను కేవలం రెండు లేదా మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీఆర్టీ(ట్రాక్ రిలేయింగ్ ట్రైన్), పీక్వూర్‌ఎస్ (ప్లాసర్ క్వీక్ రిలేయింగ్ సిస్టం) మిషన్‌లను ఉపయోగించి రికార్డు స్థాయిలో 129 కిలో మీటర్ల స్లీపర్లను పునరుద్ధరణతో పాటు 164 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులను సాధించింది.
తుది దశకు హైస్పీడ్ ట్రాక్‌ల ఆధునికీకరణ


