పెట్రోల్ బంక్ సీజ్
నందిగామరూరల్: మండలంలోని అడవిరావులపాడు గ్రామ సమీపంలోని నయారా పెట్రోల్, డీజిల్ బంకును తూనికలు, కొలతల శాఖాధికారులు సీజ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రీడింగ్‌లు, కొలతల్లో తేడాలు న్నాయని వినియోగదారులు గురువారం బంకు వద్ద ఆందోళన చేశారు. మూడు నెలల నుంచి కొలతల్లో తేడాలను గమనిస్తున్నామని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి భానుప్రసాద్ మాట్లాడుతూ డీజిల్ మోటార్ పంపు ఆన్ చేయగా డీజిల్ రీడింగ్ హెచ్చుతగ్గులు చూపిస్తోందని లీటరుకు 0.8 పాయింట్‌లు, రూ.7.76 లు డీజిల్ తక్కువగా వస్తుందని తెలిపారు. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా మోటర్ జంప్ టెక్నిక్‌ను గుర్తించామన్నారు. బంకులో మోసం జరిగినట్లు నిర్ధారించటంతో తదుపరి అనుమతులు వచ్చే వరకు నయారా బంకులో పెట్రోల్, డీజీల్ అమ్మకాలను నిలిపివేయాలని యాజమాన్యానికి సూచించి బంకును సీజ్ చేశారు. తనిఖీల్లో పీడీఎస్ డీటీ రామ్మూర్తి రెడ్డి పాల్గొన్నారు.
గంగాభవానీకి
‘లక్ష’ గారెలతో మహానివేదన
కోడూరు: కోడూరు గంగాభవానీ అమ్మవారికి ‘లక్ష’ గారెలతో మహానివేదన కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. అమ్మవారి 50వ జాతరోత్సవాల నేపథ్యంలో గురువారం గారెలతో మహానివేదన జరిపారు. కోడూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచి గారెలను వండి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఒక్కో మహిళ 54 లేదా 108 గారెలను తీసుకువచ్చి అమ్మవారికి నివేదించారు. గంగాభవానీ చిన్నఅమ్మవారి విగ్రహం ముందు గారెలను రాశిగా పోసి పండితులు కొమ్మూరి శ్రీనివాసరావు పూజలు చేశారు. అనంతరం గారెలను ప్రసాదంగా భక్తులకు అందజేశారు. ధర్మకర్త కోట యుగంధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


