మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిందని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను తీసుకువస్తుందని, తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తోందని అందరూ భావించారన్నారు. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆప్కాస్ రద్దు, పర్మినెంట్ ముద్దు అనే నినాదంతో కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలకు జీవో ఇవ్వాలని నినదించారు.
కార్మికుల జీవితాలు
బుగ్గిపాలయ్యే ప్రమాదం..
ధర్నాను ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కార్మికుల జీతాల పెంపు, కార్మికులకు రూ.21 వేలు జీతం కూటమి ప్రభుత్వం ఇస్తుందని అంతా ఆశించారన్నారు. కానీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఆప్కాస్‌తో కార్మికులకు కొంత మేర ఉపశమనం కలిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ధారదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఏజెన్సీలకు అప్పగిస్తే తిరిగి దళారీ వ్యవస్థ వస్తుందని, కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏజెన్సీలకు అప్పగించాలని ప్రయత్నిస్తోందన్నారు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వాటికి సంబంధించి జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, లేనిపక్షంలో అందరినీ కలుపుకొని నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ధర్నాకు సీపీఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.దుర్గారావు, జిల్లా కమిటీ సభ్యుడు పి.కృష్ణ మద్దతు తెలిపారు. ధర్నాలో మున్సిపల్ యూనియన్ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ప్రవీణ్, కోశాధికారి డి.స్టీఫెన్ బాబు, ఉపాధ్యక్షురాలు టి.తిరుపతమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జె.విజయలక్ష్మి వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్రం నాగరాజు, పార్క్, వాటర్, మెకానిక్, డ్రెయినేజీ, స్ట్రీట్ లైట్ సెక్షన్ బాధ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
దర్నా కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు


