‘పది’ మూల్యాంకనం ప్రారంభం
సోషల్ మినహా అన్ని సబ్జెక్టుల వాల్యూయేషన్ ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విజయవాడలో గురువారం ప్రారంభమైంది. నగరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఈ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సోషల్ మినహా అన్ని సబ్జెక్ట్‌ల జవాబు పత్రాల మూల్యాంకనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోషల్ పరీక్ష చివరిది కావటంతో ఆ పరీక్ష పత్రాలు గురువారమే నగరానికి చేరుకున్నాయి. దాదాపుగా మిగిలిన అన్ని సబ్జెక్టుల బోర్డులు ప్రారంభమయ్యాయి. 1,72,129 జవాబు పత్రాలను ఈ కేంద్రంలో మూల్యాంకనం చేయనున్నారు. సుమారు 720 మంది ఉపాధ్యాయులు తొలి రోజు మూల్యాంకనంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిర్ణయించిన గడువు లోపు మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కాస్త ఉపశమనం
ఆటోనగర్(విజయవాడతూర్పు): గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజానీకానికి గురువారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో కాస్త ఉపశమనం లభించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా కారుమబ్బులు పట్టి, ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత సుమారు 25 నిమిషాల పాటు వర్షం కురిసింది.


