ముగిసిన ఇంటర్ ‘స్పాట్’
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యాన జరుగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో ముగిసింది. విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో మూల్యాంకనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల 17న ప్రారంభమైన స్పాట్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం ఐదో తేదీ శనివారం వరకూ కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరానికి చెందిన 3,94,596 జవాబు పత్రాలను సుమారు 20 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసర్‌గా ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా విద్యాశాకాధికారి సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు.
స్పాట్ కేంద్రంలోనే మార్కుల నమోదు
మొన్నటి వరకూ మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్)ను విడదీసి బండిల్స్‌గా ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ ఓంఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించేవారు. ఈ ప్రక్రియలో ఆలస్యాన్ని తగ్గించడానికి బోర్డు అధికారులు గతేడాది తొలి సారిగా ప్రతి మూల్యాంకనం కేంద్రానికి స్కానర్‌ను అందించారు. స్కానర్ ద్వారా స్పాట్ కేంద్రంలో మూల్యాంకనం చేసిన అనంతరం మార్కుల నమోదు చేపట్టారు. 3,94,596జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం సుమారు 1,280 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో మూల్యాంకనం చేసిన 3,94,596 జవాబు పత్రాలు హాజరైన 1,280 మంది అధ్యాపకులు స్పాట్ కేంద్రంలోనే మార్కుల పోస్టింగ్
ఇంటర్ స్పాట్ విజయవంతంగా పూర్తి చేశాం
జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్‌ను నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేశాం. అన్ని స్థాయిల్లోని సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్నమై దీనిని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ప్రభుత్వానికి మార్కులను ఆన్‌లైన్ ద్వారా పంపించాం.
– సీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, ఆర్‌ఐవో, ఎన్టీఆర్ జిల్లా


