వీఆర్‌ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(గ్రామ సేవకుల సంఘం) రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగి సాహెబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేవలం రూ.10,500తో బతకలేక వీఆర్‌ఏల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం అటెండర్, వాచ్‌మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రెవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల న్యాయమైన పోరాటానికి పీడీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామంటున్నారని, కానీ వీఆర్‌ఎల జీవితాలపై మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. వీఆర్‌ఏల డిమాండ్ల సాధనకు ఈ నెల 6, 7 తేదీల్లో తహసీల్దార్‌లకు, 8, 9 తేదీల్లో ఆర్డీఓలకు 10, 11, 12 తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు, 15, 16 తేదీల్లో కలెక్టర్లకు రాయబారాలు, ఏప్రిల్ 28, 29 తేదీల్లో జిల్లా కేంద్రాలలో దీక్షలు, 30వ తేదీ కలెక్టర్లకు సామూహిక రాయబారం, మే నెల 13, 14 తేదీలలో రాష్ట్ర కేంద్రంలో రిలే దీక్షలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘం రాష్ట్ర నేతలు త్రినాథరావు, రవికుమార్, కృష్ణారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు


