చిత్రలేఖనంతో సృజనాత్మకతకు పదును
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి చిత్రలేఖనం పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్(స్పా) కళాశాల డైరెక్టర్ శ్రీకొండ రమేష్ చెప్పారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, లయన్స్ డిస్టిక్ట్–316డి, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సంయుక్తంగా రమేష్ ఆసుపత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్టిటెక్ కళాశాల ఆవరణలో 12వ నేషనల్ లెవల్ వన్ డే ఆర్ట్ ఫెస్ట్ అండ్ ఆర్ట్ క్యాంప్ శనివారం జరిగింది. స్పా కళాశాల రిజిస్ట్రార్ కేవీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం పెరుగుతుందన్నారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిత్రలేఖనంపై ఆసక్తిని పెంపోందించడానికి ప్రతి ఏడాది ఆర్ట్ ఫెస్ట్, ఆర్ట్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు గీసిన చిత్రాలను కళాశాల ఆవరణలో ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. సర్వోదయ మండలి అధ్యక్షుడు ఎన్.రాంబాబు, మా జ్యూవెలరీ డైరెక్టర్ కె.సుధాకర్, శింగరి ఆస్పత్రి వైద్యురాలు అరుణ కుమారి, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా, చిత్రకారులు జయన్న, మోహనరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


