80 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గుట్టుచప్పు డు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పటమట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు పటమట స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన సీఐ పవన్‌కిశోర్ మాట్లాడుతూ.. పటమట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎనికేపాడు లారీ బే వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనికీ చేపట్టామన్నారు. ఈ క్రమంలో గన్నవరం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును పోలీస్ సిబ్బంది ఆపగా కారు డ్రైవర్ కారును రోడ్డు మార్జిన్‌లో నిలిపి డ్రైవర్, కారు లోపల మరో వ్యక్తి దిగి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని, కారును తనిఖీ చేయగా కారులో 80 కేజీల గంజాయి గుర్తించామని చెప్పారు. నిందితులు చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామానికి చెందిన షేక్ షాజాద్(34), అదే జిల్లా పుంగనూరు మండలం, కొత్తపేటకు చెందిన షేక్ ఫయాజ్‌లుగా గుర్తించామన్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని 80 కేజీల గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
మధురానగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి చెందిన ఘటన గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ ఆర్‌ఆర్‌పేటకు చెందిన కసింకోట యువరాజు(41) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి కిరాయికు ప్రయాణికులను దించేసి ఇంటికి వస్తుండగా బీఆర్టీఎస్ రోడ్డు పడవలరేవు సెంటర్ శివాలయం వద్దకు వచ్చేసరికి ఆటో స్కిడ్ అయ్యింది. దీంతో ఆటో డివైడర్‌ను ఢీకొని తిరగబడింది. ఆటోలో ఉన్న యువరాజు తలకి బలమైన గాయం తగలటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


