ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి
● వీఎంసీ స్థాయీసంఘం సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి ● అజెండాలో 31 అంశాలు ఆమోదిస్తూ తీర్మానం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి ప్రణాళికాబద్ధంగా నిధులు సమకూరుస్తున్నామని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో శుక్రవారం ఆమె అధ్యక్షతన స్థాయీసంఘం సమావేశం జరిగింది. అజెండాలో మొత్తం 38 అంశాలు రాగా అందులో రెండు అంశాలు రద్దు చేశారు. నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ కేటాయించాలని ఒక అంశం, రెండు అంశాల్లో లీజును ఏడాది వరకు కేటాయింపులు జరగ్గా పూర్తి వివరాలు తర్వాత సమావేశంలో అందించాలని ఒక అంశం, ధ్రువీకరణకు ఒక అంశం, రికార్డుకు ఒక అంశంతో పాటు 31 అంశాలు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరంలో మూడు సర్కిళ్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వీఎంసీ మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రధానాంశాలు
● స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో నగరంలోని వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణకు 2020 జనవరిలో కాంట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులను వీఎంసీ నియమించుకుంది. ఈ క్రమంలో కాంట్రాక్టరుకు వారం రోజులకు మాత్రమే వర్క్ ఆర్డర్ ఇవ్వగా 28 రోజులకు 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు రూ.400 చొప్పున 28 రోజులకు రూ.33.60 లక్షలు బిల్లులు పెట్టారు. దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు లేవని, ఇప్పటికే రెండుమార్లు వాయిదా వేసినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు అందించనందున స్థాయీ సంఘం ప్రతిపాదనను రద్దు చేసింది.
● కృష్ణలంక బాలాజీనగర్ కర్మల భవనం మూడేళ్లపాటు లీజుకు ఇవ్వాలని, దీనికి ఇప్పటికే టెండర్లు వేయగా ఇరువురు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారని, అత్యధికంగా పాడుకున్న జి.శ్రీనివాసరావుకు కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనపై టెండరుదారుకు ఏడాది మాత్రమే లీజుకు ఇవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు.
● సర్కిల్–3 పరిధిలోని విజయ్ నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పాత మోటర్ల స్థానంలో కొత్త మోటర్లు అమర్చాలని, అందుకు రూ.49.80 లక్షల వ్యయం వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనను స్థాయీ సంఘం సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
● 56వ డివిజన్‌లోని పాతరాజరాజేశ్వరి పేట మెయిన్‌రోడ్డులో మహంకాళమ్మ గుడి జంక్షన్ నుంచి రైల్వేగేటు వరకు రోడ్డుకు ఇరువైపులా పేవర్‌బ్లాక్స్, డ్రైన్ల మరమ్మతులకు రూ.48.23 లక్షలు వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి విడుదల చేయాలని వచ్చిన ప్రతిపాదనను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
● సర్కిల్–3 పరిధిలోని 4వ డివిజన్ సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో రోడ్డు నం.1 మిగిలిన రోడ్లకంటే కూడా పల్లంగా ఉందని, ఈ రోడ్డు మెరుగుపరచటానికి అవసరమయ్యే నిధులు రూ.39.42 లక్షలు వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి విడుదల చేయాలని సభ్యులు తీర్మానించారు.


