చలసానిపై నిరాధార ఆరోపణలు తగదు
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులుపై అజ్ఞాత మహిళ నిరాధారమైన లైంగిక ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని ఆ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఉయ్యూరు అంజిరెడ్డి, బొడ్డు రామచంద్రరావు, పలగాని కొండలరావు, నెక్కలపు వాణిశ్రీ, శనగల వెంకట శివజ్యోతి చెప్పారు. హనుమాన్‌జంక్షన్‌లోని పాలశీతల కేంద్రంలో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అజ్ఞాతంలో ఉంటూ ఆరోపణలు చేయటం సరికాదని, తగిన సాక్ష్యాధారాలతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గాన్ని ఆశ్రయించాలని లేదా పోలీసులు, మీడియా ముందుకు రావాలని ఆ మహిళను డిమాండ్ చేశారు. అన్యాయం జరిగినట్లు నిరూపితమైతే యూనియన్ తరఫున చర్యలు తీసుకోక తప్పదని, అంతేకాక చట్టరీత్యా కూడా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చలసాని ఆంజనేయులు ప్రైవేట్ కంపెనీ కాదని, లక్షా యాభై వేల మంది పాడి రైతుల సంస్థ అని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గుర్తు తెలియని మహిళ పదేపదే ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదల చేయటం తగదన్నారు.


