
జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా జిల్లాలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, సాంప్రదాయ జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టలన్నారు. కేవలం సబ్సిడీ రాయితీల కోసం కాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు తీసుకుని, వారి మెరుగైన జీవనప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. పొలాల్లో ఐదు నుంచి పది సెంట్ల స్థలంలో కొరమేను సాగు చేపట్టి అధిక లాభాలు పొందొచ్చని, ఇందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, ఆసక్తి కలిగిన వారిని గుర్తించాలని ఎంపీడీఓ, మత్స్యశాఖ అధికారులకు సూచించారు. తీరప్రాంత మండలాల్లో పీతల సాగు, సముద్రనాచు పెంపకం, డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయ సేవలు అందించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ, ఏపీఎంఐపీ పీడీలు హరిహరనాథ్, ఎస్.వి.రత్నాచార్యులు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి, పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.చిననరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ షేక్ షాహిద్‌బాబు, ఎల్‌డీఎం రవీంద్రారెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.