
గుట్టుగా గురుకుల పాఠశాల తరలింపునకు యత్నం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం)ను గుట్టుగా తరలించేందుకు చేస్తున్న యత్నం వివాదాస్పదమైంది. విజయవాడ భవానీపురంలోని ఐరన్‌యార్డ్ పారంతంలో ఉన్న గురుకుల పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం బొద్దనపల్లెకు మార్చాలని ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య ఈ నెల ఐదో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం దసరా సెలవులకు విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఈ తరుణంలో తమకు సమాచారం ఇవ్వకుండా స్కూల్ తరలించే యత్నాలను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలను మారుమూల గ్రామంలో సుమారు ఏడేళ్ల క్రితం మూతబడిన కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎటువంటి రక్షణ లేని కాలేజీ భవనంలోకి తరలిస్తే, అక్కడ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
గతంలో వద్దని.. ఇప్పుడు కావాలని..
విద్యాధరపురంలోని ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ భవనంలో గురుకుల పాఠశాల 16 ఏళ్లు నడిచింది. ఆర్టీసీ యాజమాన్యం ఖాళీ చేయాలనటంతో నాలుగేళ్ల క్రితం భవానీపురం ఐరన్‌యార్డ్‌లోని ఒక భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జిల్లాల నుంచి సుమారు 211 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది జూలైతో భవనం అద్దె అగ్రిమెంట్ గడువు ముగిసింది. అంతకు ముందు నుంచి వేరే భవనం కోసం గాలిస్తున్నారు. ఈదర గ్రామంలో ఉన్న కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన డిగ్రీ కాలేజీ భవనాన్ని గతంలో పరిశీలించగా ఎక్కడో దూరంగా మారుమూల ఉండటంతో ఏపీఆర్ స్కూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య తిరస్కరించారని సమాచారం. ఆయనే ఇప్పుడు అదే భవనంలోకి మార్చాలని ఉత్తర్వులు జారీ చేయడానికి ఈ గురుకుల పాఠశాలలో గతంలో ప్రిన్సిపాల్‌గా పని చేసిన వ్యక్తి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న స్కూల్‌ను వేరే జిల్లాకు మార్చకూడదన్న జీఓ ఉంది. అయినా అధికారులు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హం. పాఠశాల తరలింపు విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్ స్కూల్ వద్దకు వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు.
ఏడేళ్ల క్రితం మూతబడిన
కాలేజీలో ఏర్పాటుకు చర్యలు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
విద్యార్థుల తల్లిదండ్రులు
గతంలో ఇదే భవనాన్ని
తిరస్కరించిన ఏపీఆర్
స్కూల్ సెక్రటరీ

గుట్టుగా గురుకుల పాఠశాల తరలింపునకు యత్నం!

గుట్టుగా గురుకుల పాఠశాల తరలింపునకు యత్నం!