
ఆదిదంపతుల నదీ విహారంపై సందిగ్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్స వాల ముగింపును పురస్కరించుకుని ఆది దంపతులు నదీ విహారం చేసేందుకు అవసరమైన హంసవాహనం ముస్తాబవుతోంది. దుర్గాఘాట్‌లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయ దశమిని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణా నదిలో విహరిస్తారు. ఇందు కోసం హంసవాహనాన్ని రంగులతో ముస్తాబు చేయడం పూర్తగా, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. అయితే నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో నదీ విహారం అనుమానమేనని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజులుగా మూడు లక్షల క్యూసెక్కు లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హంసవాహనం (ఫంట్) నదిలోకి వెళ్లడం ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. దుర్గాఘాట్ వద్దే హంసవాహనంపై ఆదిదంపతులకు పూజలు నిర్వహించి, ఫంటును మూడు సార్లు ముందుకు, వెనక్కి నడిపించి కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం సమాచారం.