
పాఠశాల విద్యపై మంత్రి చూపే శ్రద్ధ ఇదేనా?
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘విద్యాశాఖ మంత్రిగా దాన్ని వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న నారా లోకేష్ గారూ..పాఠశాల విద్యపై మీరు చూపే శ్రద్ధ ఇదేనా’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్‌లో గత నాలుగేళ్లుగా ఉన్న ఏపీ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలికలు)ను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం పరిధిలోని పొలాల మధ్యగల మూతబడిన కాలేజీ భవనంలోకి తరలించటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ లతోపాటు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి.
దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి?
వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల(శ్రీకాకుళం నుంచి నెల్లూరు)కు చెందిన మైనార్టీ బాలికలు చదువుకుంటున్న ఈ గురుకుల పాఠశాల యాజమాన్యం, కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల భద్రతతో మారుమూల ప్రాంతానికి తరలించటం బాధాకరం అన్నారు. పేరెంట్స్ కమిటీని సంప్రదించి ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాల్సిన కనీస బాధ్యత విద్యా శాఖ అధికారులకు లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయవాడ ఉత్సవ్ పేరుతో బిజీబిజీగా ఉండటంతో విద్యార్థినుల తల్లిదండ్రుల ఘోష పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే చదివించండి లేదా టీసీలు తీసుకుని పొమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం బాధాకరమన్నారు.
విద్యార్థినుల జీవితాలతో ఆడుకుంటున్నారు
విద్యా సంవత్సరం మధ్యలో అర్ధంతరంగా స్కూల్‌ను తరలించటం విద్యార్థినుల జీవితాలతో ఆడుకోవడమేనని వెలంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉంది.. పూర్తి రక్షణ ఉంటుదని పిల్లలను ఇక్కడ చదివిస్తుంటే, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో స్కూల్ పెడితే వైద్యం, ఇతర సహాయం కావాలంటే పట్టించుకునే వారెవరని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు స్కూల్‌ను ఇక్కడే ఉంచాలని, లేదంటే తల్లిదండ్రులను పిలిచి మీటింగ్ పెట్టి వారికి అభ్యంతరం లేదని చెబితే తప్ప మార్చటానికి వీలు లేదని వెలంపల్లి స్పష్టం చేశారు.
స్కూల్ మార్చాల్సివస్తే తల్లిదండ్రులకు ఎందుకు తెలియపరచరు?
ఇదేనా ఆడపిల్లల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించేది?
మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల తరలింపుపై మాజీ మంత్రి
వెలంపల్లి ఆగ్రహం