
లయ తప్పుతున్న లబ్ డబ్
గుండెపోటుకు కారణాలివే...
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె స్పందన అదుపు తప్పుతోంది. యుక్త వయస్సులోనే గుండెపోటు మరణాలను చూస్తున్నాం. కారణం ఏదైనా... ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి మరణించే వారిని ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణాలో ప్రతిఏటా ఐదు వేల మందికి పైగానే గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో మరణాలు సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతిఏటా ఒక నినాదంతో సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డేను జరుపుకొంటున్నాం. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్. ప్రతి గుండె స్పందన కీలకమని, గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, చెకప్‌లను ఆలస్యం చేయొద్దని, గుండె సంబంధిత సమస్యల హెచ్చరిక సంకేతాలపై అప్రమత్తంగా ఉండాలనేది ఈ నినాదం అర్ధం.
యువతలో గుండెపోటు
ప్రస్తుతం యువత గుండెపోటుకు గురవడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. యువత గుండెపోటుతో మరణిస్తే ఆ ప్రభావం కుటుంబంపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మూడు మరణాల్లో గుండెపోటు మరణం ఒకటిగా నమోదవుతోంది. అన్ని రకాల క్యాన్సర్‌ల కంటే గుండెపోటు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు మరణాల్లో 80 శాతం నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు
ఇలా చేయాలి...
● క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి.
● వత్తిడిని తగ్గించుకోవాలి.
● ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.
● ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
●బీఎంఐ 18.5–25 మధ్య ఉండేలా చూసుకోవాలి.
● ప్యాక్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్‌ఫుడ్, రెడ్‌మీట్ తీసుకోకుండా ఉండటం మంచిది.
● ఆహారంలో ఉప్పును తగ్గించాలి.
వ్యాధులను ఇలా అదుపులో ఉంచుకోవాలి
● మధుమేహం ఉన్న వారు హెచ్‌బీఏ1సీ 6.5 లోపు ఉండేలా చూసుకోవాలి. హెచ్‌బీఏ1సీ ఒక శాతం పెరిగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ 11 శాతం ఉంటుంది.
● మధుమేహం, కిడ్నీ జబ్బులు ఉన్న వారు బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. మామూలు వ్యక్తులకు 130/80 ఉండొచ్చు.
● మధుమేహుల్లో ఎన్‌డీఎల్ కొలస్ట్రాల్ 50 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధారణ వ్యక్తుల్లో 100 లోపు ఉండొచ్చు.
జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కొలస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలు.
ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి మధుమేహం ఉండగా, ప్రతి పది సెకన్లకు ఇద్దరు మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అదుపులో లేని వారిలో 75 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహులు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురవడం వలన గుండెపోటు వచ్చినట్లు కూడా తెలియదు.
మధుమేహుల్లో 25 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు.
ప్రీ డయాబెటీస్ ఉన్న వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు ఉన్న వారికి గుండె పెరగడం వంటి సమస్యతో పాటు గుండెపోటుకు గురవుతున్నారు.
మెటబాలిజం సిండ్రోమ్ కూడా గుండెపోటుకు కారణమే.
నేడు వరల్డ్ హార్ట్ డే..
ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్
మీ గుండె స్పందన తెలుసుకోండి
రెగ్యులర్‌గా గుండె చెకప్ చేయించుకోండి
గుండెపోటుకు గురయ్యే వారిలో
25 శాతం యువకులే
జీవనశైలి వ్యాధులే కారణం
అంటున్న వైద్యులు
ఛాతీలో నొప్పిని అశ్రద్ద చేయొద్దు
ప్రతి ఏటా ఉమ్మడి కృష్ణాలో ఆరు వేల మందికి పైగా గుండెపోటుకు
గురవుతున్నట్లు అంచనా