
ఇక తాడోపేడో!
సాక్షి టాస్క్ ఫోర్స్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం ఏంటని, ఎమ్మెల్యే వర్గం భగ్గుమంటోంది. దీంతో ఇటీవల బహిరంగంగానే ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ కమిటీలు, ఇతర పదవులు నియోజకవర్గంలోని నాయకుల కార్యకర్తల ప్రమేయం లేకుండా నడుస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కనీసం వార్డు కమిటీల నియామకంలో కూడా సంప్రదించలేదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది.
పైకి బాగానే ఉంటున్నా..
ఎమ్మెల్యే, ఎంపీ పైకి చెట్ట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం కత్తులు దూసుకొంటున్నారు. తిరువూరు టీడీపీలో ఎమ్మెల్యేకు సమాంతరంగా, ఎంపీ ఓ వర్గాన్ని ప్రోత్సహించటంతోపాటు, వారికి షెల్టర్‌గా ఎంపీ కార్యాలయం మారటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎస్సీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కావడంతోనే, ఎంపీ కర్ర పెత్తనం చేస్తున్నారని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకుండా, ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీల్డ్ కవర్లలో పదవులు కేటాయించి పంపిచటం ఏంటని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
అవినీతిలోనూ అంతా ఆయనే..
అవినీతి దందాల విషయంలో పార్లమెంట్ ముఖ్యనేతదే పైచెయ్యిగా మారింది. రేషన్ బియ్యం మాఫియా చేసే వ్యక్తిని, తన కార్యాలయంలోనే ఉంచుకొని రేషన్ బియ్యం, నెలవారీ మామూళ్లు దండుకోవటాన్ని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో పెద్దవరం చెక్‌పోస్టు నుంచి తెలంగాణకు బియ్యం రవాణా చేస్తున్నది పార్లమెంట్ ముఖ్యనేత అనుచరులేనని, ఎమ్మెల్యే వర్గీయులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. తిరువూరులో గంజాయి మాఫియాకు పార్లమెంట్ ముఖ్యనేత వత్తాసు పలుకుతున్నారనే భావన ఎమ్మెల్యే వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని పార్టీ పదవులు, దేవాలయాల చైర్మన్ పదవులు పార్లమెంట్ ముఖ్యనేత బేరం పెట్టి అమ్ముకున్నారని, ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్ ముఖ్యనేత ఓ ఎన్‌ఆర్‌ఐతో డబ్బులు ఖర్చు పెట్టించి, గెలిచాక కరివేపాకులా తీసి వేశారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మొత్తం మీద ఎమ్మెల్యే వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతోంది.
తిరువూరు టీడీపీలో తారస్థాయికి విభేదాలు
పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు
నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ పెత్తనంపై ఆగ్రహం
ఎవరి మాట వినాలో తెలియక ఇరుకున పడుతున్న అధికారులు
పార్టీ, నామినేటేడ్ పదవులకు సీల్డ్ కవర్‌లో పేర్లు పంపడంపై రగిలిపోతున్న ఎమ్మెల్యే వర్గీయులు