శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో కొనసాగుతున్న తారురోడ్డు పనులు
భువనేశ్వర్: మూల విరాటుల అంగాలకు ముప్పు వాటిల్లే విపత్కర చర్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో ఇటీవల తారు రోడ్డు పనులు చేపట్టారు. ప్రస్తుత నిర్మాణ శైలి రథయాత్ర ప్రక్రియలో రత్నవేదిక నుంచి యాత్రకు తరలివచ్చే మూలవిరాట్‌ల శ్రీఅంగాల (విగ్రహాల)కు భారీ ముప్పు కలిగించే రీతిలో తారస పడుతున్నాయి.
సువిశాల బొడొదండొ మార్గం పొడవునా తారుపూత పూస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్ప విభజనతో రెండు అంచెల రోడ్డుగా మలుస్తున్నట్లు వర్ధమాన నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. ఈ విభజన రథాల కదలికకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. అలాగే శ్రీమందిరం గర్భగుడి రత్నవేదిక నుంచి మూలవిరాట్ లను రథాల పైకి తరలించే పొహొండి కార్యక్రమంలో కాలు జారడం వంటి చిరు ప్రమాదాలతో పెద్ద తప్పిదాలను ప్రేరేపిస్తాయని కలవర పడుతున్నారు.
యాత్ర పొడవునా పలుమార్లు 3 భారీ రథాలను మలుపు తిప్పాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో నిర్మాణశైలి తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. యాత్ర నిర్వహణ దృష్టిలో పెట్టుకుని సింహద్వారం ఆవరణ, బొడొదండొ మార్గం తారుపూత పనులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విభజన, ఎగుడు దిగుడులు తొలగించాలని శ్రీమందిరం పాలకమండలి సీనియర్ సభ్యుడు దుర్గాప్రసాద్ దాస్ మహాపాత్ర కోరారు. దీనిపై ప్రధాన పాలనాధికారి (సీఏఓ) దృష్టి సారించాలన్నారు.
రథ వాకిలిలో భద్రత..
రథయాత్ర ఆద్యంతాల్లో మూల విరాట్‌ల రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిట నిలుపుతారు. యాత్ర ప్రారంభం పురస్కరించుకుని ఈ వాకిలిలో రథ ప్రతిష్ట ముగించి మూల విరాట్‌లను గొట్టి పొహొండి ప్రక్రియలో ఒక్కొక్కటిగా రథాల పైకి తరలిస్తారు. అలాగే యాత్ర చిట్టచివరి ఘట్టం నీలాద్రి విజే పురస్కరించుకుని రథాలపై ఆసీనులైన మూర్తులను సురక్షితంగా శ్రీమందిరం రత్న వేదికకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రాంగణంలో సిద్ధం చేసిన తారురోడ్డు ఉపరితలమంతా ఎగుడు దిగు డుగా తయారైంది.
ఈ పరిస్థితిని సవరించి పూర్తిగా చదును చేయకుంటే గొట్టి పొహండి, నీలాద్రి విజే పురస్కరించుకుని జరిగే మూల విరాట్‌ల తరలింపు సందర్భంగా కాలు జారుడు వంటి ప్రమాదాలతో మూల విరాట్‌ల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం తలెత్తుతుంది. యాత్ర ఆద్యంతాలు మలుపు తిప్పే పరిస్థితుల్లో చకచకా తరలే రథాల కదలికకు ఆటంకం కలగవచ్చు. ఈ అభ్యంతరాల దృష్ట్యా రోడ్డు చదును చేసేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా స్పందించారు. దశమహాపాత్ర నిర్మాణ సంస్థ అధికారులు ఈ నెలలోగా ఎగుడు దిగుడులు తొలగించి కొత్తగా నిర్మితం అవుతున్న రహదారి చదును చేసే పనులు పూర్తి చేస్తామని అనుబంధ అధికార వర్గాలు హామీ ఇచ్చారు.
సర్దుబాటుకు ఆదేశాలు..
తారుపూతలో ఎగుడు దిగుడుల కారణంగా యాత్ర ఆద్యంతాల్లో రథాన్ని మలుపు తిప్పడంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయని అనుబంధ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరాలను ఆలయ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పూరీ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నిర్మాణ శైలిలో స్వల్ప మార్పుతో అనుకూల రీతిలో సర్దుబాటు చేయాలని నిర్మాణ సంస్థ ఓబీసీసీని ఆదేశించారు.
రథశాల ప్రాంగణంలో..
శ్రీమందిరం కార్యాలయం పరిసరాల్లో స్వామి వార్షిక రథయాత్ర కోసం కొత్త రథాల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రథాల పలు భాగాల నిర్మాణం అంచెలంచెలుగా పూర్తి కావడంతో క్రమ పద్ధతిలో అమర్చి, రథం రూపుదిద్దుతారు. అనంతరం ఈ ప్రాంగణం నుంచి మలుపు తిప్పి శ్రీమందిరం సింహద్వారం ఆవరణకు తరలించాల్సి ఉంటుంది.
అయితే ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తేలుతున్నాయి. రథ భాగాల అమరిక పురస్కరించుకుని భారీ కొయ్య భాగాల తరలింపు, రథాల మలుపు పురస్కరించుకుని రోడ్డుపై తేలియాడుతున్న రాళ్లతో ఊహాతీత ప్రమాదాలు తలెత్తే అవకాశం లేకపోలేదని భొయి సేవకవర్గం ప్రముఖుడు సర్దార్ రవిభొయి తెలిపారు. ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తొలగించి చదును చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు తెలియజేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment