జయపురం: ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదిక మోసాలు రోజురోజుకూ కొనసాగుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే స్థానిక పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై బాధిత యువతి జయపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం వెలుగు చూసింది. పట్టణంలోని లింగరాజ్‌నగర్‌కు చెందిన రాథానాథ్ రథొ కుమారుడు హరిహర రథొ తాను నాల్కో ఢిల్లీ డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌నని మేట్రిమొనీలో పరిచయం చేసుకున్నాడు. ఢిల్లీలోని నోయిడాలో నివసిస్తున్నట్లు చిరునామా ఇచ్చాడు.
దీనిని విశ్వసించిన స్థానిక పారాబెడ లోని శ్రీరామనగర్‌కు రాజారాంసింగ్ పెద్ద కుమార్తె, ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారి రీతూ సింగ్ సంబంధం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 9న జయపురంలోని కల్యాణ మండపంలో బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే 3 నెలలైనా భర్త ఉద్యోగం విషయం, ఉంటున్న ప్రాంతంపై సంతృప్తికరమైన వివరాలు తెలియలేదు. ఈనెల 12 రాత్రి ఢిల్లీలో ఉన్న భర్తకు ఫోన్ చేసి, ఇంటి లొకేషన్ పంపించాలని కోరగా అతని నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.
దీంతో మేట్రిమోనీలో ఇచ్చిన వివరాలు నిజం కాదని గ్రహించిన వధువు కుటుంబ సభ్యులు గ్రహించారు. మరోవైపు అత్తమామలు, ఆడబడుచులు పదేపదే డబ్బు తీసుకు రావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ మేరకు పట్టణ పోలీసు స్టేషన్‌లో రీతూ సింగ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు హరిహర కుటుంబ సభ్యులను పిలిపించి, వివరాలు సేకరించారు. అయితే నిందితుడి ఫోన్ స్విచాఫ్ అని రావడంతో దర్యాప్తు చేపడుతున్నట్లు పట్టణ పోలీసు అధికారి సంభిత్ బెహర వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment