
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేంద్ర నాయక్(54) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు వ్యక్తులు మరణాయుధాలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న కాసీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం పీహెచ్‌సీకి తరలించారు.
దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నాయక్ కాసీపూర్‌కు సమీపంలోని సికరలోడ గ్రామంలో ఉన్న తన పొలానికి వ్యవసాయం పనులు చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చంద్రగిరి పంచాయతీకి చెందిన భాగో గౌడొ, అతని ఇద్దరు కుమారులు అతనిపై మరణాయుధాలతో ఒక్కసారిగా దాడికి దిగారు.
దీంతో తీవ్రగాయాల పాలైన నాయక్.. అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం నిందితులు పరారయ్యారు. గత కొద్ది కాలంగా ఇరువర్గాల మధ్య తగాదాలు ఉన్నాయని సమాచారం. మృతుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా యువజన కాంగ్రెస్ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. అతని మృతిపట్ల పలువురు కాంగ్రేస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment