
రాజాం సిటీ: మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలో ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ(58) దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత ఉపాధ్యాయుడి మృతిని అంతా ప్రమాదంగా భావించి, బంధువులకు సమాచారమిచ్చారు. మరోవైపు విషయం తెలుసుకున్న రాజాం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతిపై ఆరాతీశారు. రక్తపు మడుగులో ఉపాధ్యాయుడి మృతదేహం, అతడి ముఖంపై గాయాలు ఉండడంతో దానిని హత్యగా గుర్తించారు. స్థానికులతో పాటు ఉపాధ్యాయుడి స్వగ్రామంలో కూడా దర్యాప్తు చేయగా ఉపాధ్యాయుడు హత్యకు గురైనట్లు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా.. రాజాం పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ తెర్లాం మండలంలోని కాలంరాజుపేటలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే పాఠశాలకు బయలుదేరిన ఆయన కొత్తపేటకు దగ్గరలో హత్యకు గురయ్యాడు. మృతదేహం రోడ్డు పక్కనే బొలెరో వాహనం వద్ద పడి ఉంది. స్థానికులు ఈ విషయాన్ని రాజాం పోలీసులకు తెలియజేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు కృష్ణ మృతదేహాన్ని గుర్తించి, బంధువులకు విషయం తెలియజేశారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహంపై పడి బోరున విలపించారు.
ఫిర్యాదులో ఏముంది..
తాము కొంతకాలంగా రాజాంలోని గాంధీనగర్‌లో ఉంటున్నామని, తన తండ్రి కృష్ణ 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారని కృష్ణ కుమారుడు శ్రావణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతకుముందు తమ స్వగ్రామం తెర్లాం మండలం, ఉద్దవోలులో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా గెలుపొంది, సేవలందించారన్నారు. ఉద్యోగం రావడంతో రాజాంలో ఉండి, ప్రశాంత జీవనం గడుపుతున్నామని, పరోక్షంగా గ్రామంలో రాజకీయాలకు మద్దతుగా నిలుస్తుండేవాడన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన వ్యక్తికి తన తండ్రి మద్దతు ఇచ్చాడని, దీనిని ఓర్వలేక ప్రత్యర్థివర్గమైన మరడాన వెంకటనాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలు మా నాన్నపై కక్ష పెంచుకున్నారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే మా నాన్న శనివారం స్కూల్‌కు వెళ్తుండగా, ఇదే అదునుగా భావించిన దుండగులు హత్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment