
● కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్
భువనేశ్వర్: జాతీయ నూతన విద్యా విధానం(ఎన్‌ఎన్‌ఈపీ)–2020 అమలులో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ), అనుబంధ పాఠశాలల్లో ఇంగ్లిష్, హిందీ భాషల ఎంపికలతో పాటు ఒడియాతో సహా బోధనా మాధ్యమంగా భారతీయ భాషలను ఎంపిక చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసిందని శనివారం ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో పేర్కొన్న భారతీయ భాషలను ప్రీ–ప్రైమరీ తరగతుల నుంచి 12వ తరగతి వరకు ఐచ్ఛిక మాధ్యమంగా, ఇతర అందుబాటులో ఉన్న ఎంపికలతో పాటు బోధనా మాధ్యమంగా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. 8వ షెడ్యూల్‌లో 22 భారతీయ భాష లు ఈ జాబితాలో చోటు చేసుకున్నట్లు గుర్తుచేశారు. భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా చేర్చడం బహు భాషావాదాన్ని ప్రోత్సహించడం, భాషా వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రధాన సోపానంగా అభిప్రాయం వ్యక్తంచేశారు. వివిధ భాషల్లో విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సీబీఎస్‌ఈ విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడం తోపాటు సాంస్కృతిక, భాషా గుర్తింపులతో వారి సంబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు వివరించారు.
బాంబు దాడి కేసులో
నిందితుల అరెస్ట్
బరంపురం: గంజాం జిల్లాలోని బుగడాలో మందుల దుకాణంపై ఈనెల 16న జరిగిన బాంబు దాడి కేసులో పరారైన నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై ఐఐసీ అధికారి చిత్రరంజన్ బెహరా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుగడా పోలీసు స్టేషన్ పరిధిలోని మెడికల్ ప్రాంగణం వద్ద ఉన్న దుకాణంపై దుండగులు నాటు బాంబులతో దాడి చేసి, పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయలు కాగా, దుకాణంలోని ఔషధాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. దీనిపై బాధిత యజమాని సంతోష్‌కుమార్ పోలీసులకు ఫర్యాదు చేశారు. కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేయడంతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 బైక్‌లు, సెల్‌ఫోన్, నాటు తుపాకీ, 2 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
దుకాణాల్లో ముమ్మర తనిఖీలు
పర్లాకిమిడి: పట్టణంలో లైసెన్సులు లేకుండా మాంసం విక్రయిస్తున్న దుకాణాల్లో మున్సిపల్ శాఖ, ఆహర భద్రతా విభాగం అధికారులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంబంధిత వ్యాపారులపై అపరాధ రుసుం విధించారు. మున్సిపల్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించి మాంసం విక్రయిస్తున్న దుకాణదారులు, టిఫిన్ బండి నిర్వాహకులపై రూ.30 వేల జరిమానా వసూలు చేశారు. ఫుడ్ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు లేని వారిపై చర్యలు తీసుకున్నారు. అలాగే 167 కిలోల పాలిథిన్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పురపాలక శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి వనమాలి శత్పతి, జిల్లా ఆహార తనిఖీ అధికారి తపస్వినీ బెహారా, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు.

మార్కెట్‌లో మాంసం దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment