కేజీబీవీలో విచారణ చేస్తున్న డీఈవో ప్రేమ్‌కుమార్, సిబ్బంది
ఒడిశా: స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ గ్రూప్ ఎంపీహెచ్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు శనివారం రాత్రి అదృశ్యం కావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆచూకీ కనుగొనడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందడంతో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నిమ్మక ప్రేమ్‌కుమార్, సూపరెంటెండెంట్ రంగాచారి, డిప్యూటీఈవో విజయకుమారి, జీసీడీవో రోజారమణి, ఎంఈవో–2 సూర్యచంద్రరావులు వెంటనే కేజీబీవీని ఆదివారం సందర్శించి సుదీర్ఘ విచారణ చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అదృశ్యమైన విద్యార్థినుల్లో ఒకరికి జన్మదినం కావడంతో వారి బంధువులు శనివారం ఉదయం కేక్, స్వీట్లు తెచ్చి ఇచ్చేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి బర్త్‌డే జరుపుకుని రోల్‌కాల్ వరకు ఉన్న విద్యార్థినులు వాష్‌రూమ్‌కు వెళ్తామని చెప్పి పాఠశాల నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వారిద్దరూ పాఠశాలలో లేకపోవడంతో ప్రిన్సిపాల్ రూప అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై వెంకటరమణ, స్థానిక ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టి విద్యార్థినుల ఆచూకీ కనుగొన్నారు. వారిద్దరూ కేజీబీవీ సమీపంలో ఉన్న ఒక అమ్మాయి ఇంటివద్ద ఉన్నారు. దీంతో వారిని పోలీసులు తీసుకువచ్చి విద్యాశాఖాధికారులు, కేజీబీవీ సిబ్బంది సమక్షంలో పేరెంట్స్‌కు అప్పగించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీలు అంటే క్రమశిక్షణకు నిలయాలని ఇటువంటి విద్యాసంస్థలో ఎవ్వరికీ చెప్పకుండా విద్యార్థినులు బయటకు వెళ్లారంటే సిబ్బంది బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment