intermediate vocational courses
-
కలకలం రేపిన విద్యార్థినుల అదృశ్యం
ఒడిశా: స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ గ్రూప్ ఎంపీహెచ్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు శనివారం రాత్రి అదృశ్యం కావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆచూకీ కనుగొనడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందడంతో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నిమ్మక ప్రేమ్‌కుమార్, సూపరెంటెండెంట్ రంగాచారి, డిప్యూటీఈవో విజయకుమారి, జీసీడీవో రోజారమణి, ఎంఈవో–2 సూర్యచంద్రరావులు వెంటనే కేజీబీవీని ఆదివారం సందర్శించి సుదీర్ఘ విచారణ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అదృశ్యమైన విద్యార్థినుల్లో ఒకరికి జన్మదినం కావడంతో వారి బంధువులు శనివారం ఉదయం కేక్, స్వీట్లు తెచ్చి ఇచ్చేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి బర్త్‌డే జరుపుకుని రోల్‌కాల్ వరకు ఉన్న విద్యార్థినులు వాష్‌రూమ్‌కు వెళ్తామని చెప్పి పాఠశాల నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వారిద్దరూ పాఠశాలలో లేకపోవడంతో ప్రిన్సిపాల్ రూప అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై వెంకటరమణ, స్థానిక ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టి విద్యార్థినుల ఆచూకీ కనుగొన్నారు. వారిద్దరూ కేజీబీవీ సమీపంలో ఉన్న ఒక అమ్మాయి ఇంటివద్ద ఉన్నారు. దీంతో వారిని పోలీసులు తీసుకువచ్చి విద్యాశాఖాధికారులు, కేజీబీవీ సిబ్బంది సమక్షంలో పేరెంట్స్‌కు అప్పగించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీలు అంటే క్రమశిక్షణకు నిలయాలని ఇటువంటి విద్యాసంస్థలో ఎవ్వరికీ చెప్పకుండా విద్యార్థినులు బయటకు వెళ్లారంటే సిబ్బంది బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. -
పారా మెడికల్ విద్యార్థుల అవస్థలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు చుక్కెదురైంది. ఎంసెట్ ద్వారా వైద్యవిద్య కోర్సులు చేయలేని విద్యార్థులు పారామెడికల్ కోర్సులను ఆశ్రయిస్తే ఈ విద్యా సంవత్సరం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ వంటి పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ విద్య కనీస విద్యార్హతగా ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయించింది. దీంతో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీల్లో ఈ కోర్సుల్లో ప్రవేశాలను నిలిపేశారు. దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులను ఎప్పటిలానే పదో తరగతి విద్యార్హతతోనే ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకున్నారు. సుమారు 300 మంది విద్యార్థులు వాటిలో చేరారు. జిల్లాలో ఓకేషనల్ జూనియర్ కళాశాలలు 18 ఉండగా వాటిలో ఒకటే ప్రభుత్వ కళాశాల. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నమ్మబలికి విద్యార్థులను చేర్చుకున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ప్రైవేటు కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు మూడు నెలలుగా తరగతులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకేషనల్ ప్రైవేటు యాజమాన్యాలు ఇంటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశాయి. అయితే జూనియర్ కళాశాలల్లో పారామెడికల్ కోర్సులకు అనుమతి లేదంటూ బోర్డు తేల్చి చెప్పింది. అంతేకాదు ఇప్పటికే విద్యార్థులను చేర్చుకున్న కళాశాలలు వారిని ఇతర కోర్సుల్లోకి మార్చాలని ఆదేశించింది. జూలై నుంచి పారా మెడికల్ తరగతులు వింటున్న విద్యార్థులను ఇతర కోర్సుల్లో చేరమనడంతో వారు కంగుతింటున్నారు. మూడు నెలలు ఒక కోర్సును అభ్యసించి ఇప్పుడు మరో కోర్సులో చేరాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కొత్త కోర్సులో విద్యా సంవత్సరం మూడు నెలలు నష్ట పోవాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి ఫొటో, సంతకం, ఇతర వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరచాలి. అలా నమోదు చేసిన విద్యార్థికే ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీతో ఆన్లైన్లో నమోదు గడువు ముగిసింది. రూ. 400ల అపరాధ రుసుముతో ఈ నెల 21వ వరకూ అంటే శనివారం వరకూ ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. దీంతో ఇతర కోర్సుల్లో చేరే అవకాశాన్ని కూడా విద్యార్థులు కోల్పోయారు. కొన్ని కళాశాలల వారు ఆర్ఐఓ కార్యాలయం బాట పట్టారు. మరి కొందరు ఇంటర్మీడియెట్ బోర్డు తమకు అనుకూలంగా వ్యవహరించి ఈ సంవత్సరానికి అనుమతులు మంజూరు చేస్తుందని విద్యార్థులకు నమ్మబలుకుతున్నారు. మొత్తం మీద వృత్తి విద్యను అభ్యసిస్తే తమ కాళ్ల మీద తాము బతకవచ్చు అనే ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మోసపోయారు. అటు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరలేక, అదే విధంగా ఒకేషనల్ కోర్సుల్లోనూ చేరలేక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు.